ఈసీకి సీఎం కేసీఆర్ వార్నింగ్‌.. గులాబీ బాస్‌లో హుజురాబాద్ టెన్ష‌న్‌..

కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తుంది అని ధ్వ‌జ‌మెత్తారు. టీఆర్ఎస్ ప్లీన‌రీలో సీఎం కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు. భార‌త ఎన్నిక‌ల సంఘం రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌గా వ్య‌వ‌హ‌రించాలి.. గౌర‌వాన్ని నిల‌బెట్టుకోవాలి.. ఈ దేశంలో ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా, బాధ్య‌త గ‌ల పార్టీ అద్య‌క్షుడిగా, ఒక ముఖ్య‌మంత్రిగా భార‌త‌ ఎన్నిక‌ల సంఘానికి ఒక స‌ల‌హా ఇస్తున్నాను. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నాను.

కేసీఆర్ స‌భ పెట్టొద్దు ఇది ఏం క‌థ? ఇది ఒక ప‌ద్ధ‌తా? కొంద‌రు దిక్కుమాలిన రాజ‌కీయాలు చేస్తున్నారు. నాగార్జున సాగ‌ర్ స‌భ పెట్టొద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్‌లో స‌భ నిర్వ‌హించొద్దంటూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌న పార్టీ నాయ‌కులు చాలా మంది హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు. హుజూరాబాద్ ద‌ళితులు అదృష్ట‌వంతులు. ఈసీ ఏం చేసినా న‌వంబ‌ర్ 4 త‌ర్వాత ద‌ళిత‌బంధు అమ‌లు జ‌రిగి తీరుతుంది. న‌వంబ‌ర్ 4 వ‌ర‌కు ద‌ళిత బంధు అమ‌లును ఆప‌గ‌ల‌దు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడు. గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్ర‌జ‌లు దీవించి, ఆశీర్వ‌దిస్తారు. రాష్ట్ర‌మంత‌టా ద‌ళిత బంధును అమ‌లు చేస్తాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

రాబోయే ఏడేండ్ల‌లో బ‌డ్జెట్ల ద్వారా మొత్తం రూ. 23 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెడుతామ‌న్నారు. ద‌ళిత బంధుతోనే ఆగిపోం.. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌న్నారు. అట్ట‌డుగున ఉన్నందునే ద‌ళితుల‌కు మొద‌ట కార్య‌క్ర‌మం చేప‌ట్టాం. ద‌ళిత‌బంధుపై పెట్టే పెట్టుబ‌డి వృథా కాదు. ద‌ళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగ‌తికి తోడ్పాటు ఇస్తోందన్నారు. ఈ ప‌థ‌కం ద్వారా సంప‌ద సృష్టి జ‌రుగుతోంది. 75 ఏండ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచ‌న చేశారా? అని ప్ర‌శ్నించారు.

టీఆర్ఎస్ పార్టీకి రూ. 240 కోట్ల విరాళాలు
టీఆర్ఎస్ ఆర్థిక‌ప‌రంగా కూడా శ‌క్తివ‌తంగా త‌యారైంది. టీఆర్ఎస్‌కు కూడా విరాళాలు స‌మ‌కూరాయి. రూ. 240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విరాళాలు ఉన్నాయి. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన విరాళాల ద్వారా పార్టీ కార్య‌కలాపాలు కొన‌సాగుతున్నాయి. 31 జిల్లాల్లో పార్టీ కార్యాల‌యాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పార్టీ కార్యాల‌యం ఏర్పాటు చేసుకుంటామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.