కేసీఆర్‌ సోష‌ల్‌మీడియా స్టంట్స్‌!.. అందుకేనా ఆ ఫోన్ కాల్స్‌?

ట్రింగ్ ట్రింగ్‌.. ట్రింగ్ ట్రింగ్‌.. ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసి హ‌లో అంటే.. అట్నుంచి కేసీఆర్ గొంతు. అంతే, మ‌నోడు ఫుల్ షాక్‌. ముఖ్య‌మంత్రే త‌న‌కు ఫోన్ చేయ‌డంతో ఫుల్ ఖుషీ. క‌ట్ చేస్తే.. క్ష‌ణాల్లో అన్ని టీవీ ఛానెల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ ద‌డ‌ద‌డ‌లాడుతుంది. స‌ర్పంచ్‌కు స్వ‌యంగా ఫోన్ చేసిన సీఎం.. రైతులు కాల్ చేసిన కేసీఆర్‌.. ఇలా గంట‌ల త‌ర‌బ‌డి న్యూస్ న‌డుస్తుంది. మీడియా హౌజ్‌ల‌న్నిటిలోనూ ఒక‌టే హంగామా న‌డుస్తుంది. ఫ‌లానా అత‌నికి కేసీఆర్ ఫోన్ చేశార‌ట‌.. ఫ‌లానా విష‌యం మాట్లాడార‌ట‌.. అంటూ రెండు మూడు రోజులు చ‌ర్చ న‌డుస్తుంది. ఇలా అనేక‌సార్లు జ‌రగటంతో ఇదంతా కావాల‌నే చేస్తున్న ప‌బ్లిసిటీ స్టంట్ అనే వాద‌న వినిపిస్తోంది. 

కేసీఆర్ ఫోన్ చేస్తారు.. అవ‌త‌లి వారు మాట్లాడుతారు.. మ‌రి, ఆ ఫోన్ కాల్స్‌ బ‌య‌ట‌కు ఎలా వ‌స్తున్నాయ్‌? ఆ కాల్ రికార్డ్ చేస్తున్న‌ది ఎవ‌రు? వాటిని సోష‌ల్ మీడియాలో పెడుతున్న‌ది ఎవ‌రు? మీడియాకు లీక్ చేస్తున్న‌ది ఎవ‌రు? అనే అనుమానం ఎవ‌రికైనా వ‌చ్చిందా? ఒక‌వేళ వ‌చ్చినా.. ఆ జోష్‌లో ఆ విష‌యాన్ని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ, ఇదంతా ప‌క్కా ప్లాన్డ్‌గా సాగుతున్న ప్ర‌మోష‌న్ అని అంటున్నారు. 

తాజాగా, ద‌ళిత బంధు ప‌థ‌కంపై మాట్లాడుకుందామంటూ జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ సభ్యురాలు నిరోష భర్త రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడటం వైర‌ల్‌గా మారింది. ఎప్ప‌టిలానే ఆ ఫోన్ కాల్‌తో కొన్ని గంట‌ల పాటు మీడియా హౌజెస్ పండ‌గ చేసుకున్నాయి. ఈ ఎపిసోడ్‌తో అంద‌రికంటే సీఎం కేసీఆరే చాలా సంతోషించి ఉంటారు. ఎందుకంటే, జ‌స్ట్ ఒక్క నిమిషం ఫోన్ కాల్‌తో.. ద‌ళిత బంధు గురించి, కేసీఆర్ గురించి.. తెలుగు రాష్ట్రాల్లో రోజంతా తెగ చ‌ర్చ న‌డిచింది. పైసా ఖ‌ర్చు లేకుండా సింపుల్‌గా ఇంత ప్ర‌చారం మ‌రే ర‌కంగానైనా వ‌స్తుందా?

రెండేళ్లుగా సీఎం కేసీఆర్ ఫోన్ కాల్స్‌తో మంచి డ్రామా పండిస్తున్నారు. 2019లో మంచిర్యాల జిల్లాకు చెందిన యువ‌రైతు శ‌ర‌త్.. త‌న భూమికి వేరొక‌రి పేరుమీద ప‌ట్టా చేశారని ఆరోపిస్తూ సోష‌ల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ముఖ్య‌మంత్రి దృష్టికి రావ‌డంతో.. కేసీఆరే స్వ‌యంగా శ‌ర‌త్‌కు ఫోన్ చేసి ఆయ‌న స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు. ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయ్యాక‌.. ఆ విష‌యాన్ని మ‌ళ్లీ ఫేస్‌బుక్‌లో పెట్టాలంటూ కేసీఆరే రిక్వెస్ట్ చేయ‌డం.. ఆయ‌న అస‌లు ఉద్దేశ్యాన్ని చెప్ప‌క‌నే చెబుతుంది. ఆ స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ధ‌ర‌ణి వెబ్‌సైట్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అదే స‌మ‌యంలో యువ‌రైతు శ‌ర‌త్ రెవెన్యూ అధికారుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని.. కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా వాడుకున్నారు. రెవెన్యూ శాఖ‌లో ఇలాంటి అరాచ‌కాలు జ‌రుగుతుంటాయ‌ని.. అందుకే తాను ధ‌ర‌ణి వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టాన‌ని మెసేజ్ ఇచ్చారు. ఆ ఫోన్ కాల్ అప్ప‌ట్లో వైర‌ల్ కావ‌డం.. మీడియాలో హ‌డావుడి జ‌ర‌గ‌డం.. రెవెన్యూ శాఖ‌పై విమ‌ర్శ‌లు.. ధ‌ర‌ణి కావాలంటూ డిమాండ్లు.. ఇలా కాగ‌ల కార్యాన్ని చాలా సులువుగా  ఫోన్‌కాల్‌తో సాధించుకున్నారు కేసీఆర్‌. అప్ప‌టి నుంచీ ఆయ‌న అప్పుడ‌ప్పుడూ ఇలా ఫోన్‌కాల్ ట్రిక్‌ను చాక‌చ‌క్యంగా ప్ర‌యోగిస్తున్నార‌ని అంటున్నారు. 

గ‌తంలోనూ చాలాసార్లు కేసీఆర్ ఈ టాక్‌ట్రిక్స్ ప్లే చేశారు. జూన్‌లో తాను ద‌త్త‌త తీసుకున్న యాదాద్రి జిల్లా వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌కు ఫోన్ చేసి.. తాను గ్రామానికి వ‌స్తున్నానని.. అంత క‌లిసి మాట్లాడుకుందామ‌ని.. క‌లిసి భోం చేద్దామంటూ ఫోన్ చేశారు. సీఎం.. వాసాల‌మ‌ర్రికి వెళ్లేదాక ఆ ఫోన్ కాల్ తెగ వైర‌ల్ అవుతూనే ఉంది. ఇదే క‌దా కేసీఆర్‌కు కావ‌ల‌సింది..!

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్‌కు చెందిన నాగిరెడ్డి అనే రైతుకు ఫోన్ చేసి ఆలుగ‌డ్డ సాగుపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. గ‌తేడాది జులైలో జ‌గిత్యాల‌కు చెందిన ఓ రైతుకు కేసీఆర్ ఇలానే ఫోన్ చేశారు. వ‌ర‌ద కాలువ నిర్మాణం, ముంపు క‌ష్టాల‌పై మాట్లాడారు. తెలంగాణ వారికే కాదు.. ఆంధ్ర ప్ర‌జ‌ల‌కూ కేసీఆర్ ఫోన్లు చేసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. 2020 డిసెంబ‌ర్‌లో కృష్ణా జిల్లా ఘంట‌శాల‌కు చెందిన ఆద‌ర్శ రైతు ఉప్ప‌ల ప్ర‌సాద‌రావుకు ఫోన్ చేసి సీడ్రిల్ ఆధునిక వ్య‌వ‌సాయ యంత్రాల ప‌నితీరు, లాభాల గురించి వివ‌రాలు క‌నుక్కున్నారు. 

ఇలా, ప‌లుమార్లు కేసీఆర్ ఫోన్‌కాల్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే, కేసీఆర్ చేసే అన్ని కాల్స్ బ‌య‌ట‌కు రావు. తాను కావాల‌నుకున్న‌, కావాల‌ని చేసిన కాల్స్‌ను మాత్ర‌మే ఉద్దేశ్య‌పూర్వ‌కంగా వైర‌ల్ చేస్తుంటారు. ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చెన్నై ఆసుప‌త్రిలో స‌ర్జ‌రీ జ‌రిగితే.. సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఆ ఫోన్ కాల్ బ‌య‌ట‌కు రాలేదు. అంటే, ఆ విష‌యాన్ని పబ్లిసిటీకి వాడుకోవాల‌ని భావించ‌లేదు కేసీఆర్‌. అలానే అనేక అంశాల‌పై వివిధ వ‌ర్గాల ప్ర‌ముఖుల‌కు, అధికారుల‌కు, కేంద్ర ప్ర‌భుత్వ‌ శాఖ‌ల‌కు సీఎం కేసీఆర్ ఫోన్లు చేస్తూనే ఉంటారు. అవేవీ రికార్డు అవ‌వు.. బ‌య‌ట‌కు రావు.. కేవ‌లం, కేసీఆర్ ఏ విష‌యంపైనైతే చ‌ర్చ జ‌ర‌గాల‌ని కోరుకుంటారో.. ఏ టాపిక్ అయితే మీడియాలో హ‌డావుడి జ‌ర‌గాల‌ని భావిస్తారో.. ఆ స‌మ‌యంలో ఆయ‌న కావాల‌నో ఫోన్ చేస్తుంటారు.. ఆ కాల్‌ను ఆయ‌నే రికార్డు చేస్తుంటారు.. ఆ ఆడియాను మీడియాకు లీక్ చేసి.. త‌నకు కావాల్సిన‌ ప్ర‌యోజ‌నం పొందుతుంటారు. ఇలా వైర‌ల్‌గా మారే ఫోన్‌కాల్స్ య‌వ్వార‌మంతా.. కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ డైరెక్ష‌న్‌లో జ‌రిగేవే అంటున్నారు.