ఏపీలోనూ ద‌ళిత‌బంధు!.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌ ప‌రువు తీసేసిన కేసీఆర్..

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగా దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు దళితులతో ఆగదని.. గిరిజనులు, బీసీ, ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. చాలామంది కిరికిరిగాల్లు అవగాహన రాహిత్యంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. దళిత బంధు సంపూర్ణ విజయం సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 17లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని... లక్షా80వేల కోట్లు అవసరం ఉంటుందని సీఎం తెలిపారు. వచ్చే ఏడేళ్లలో తెలంగాణ 23లక్ష కోట్లు ఖర్చు పెట్టబోతోందని చెప్పారు.

దళిత బంధులాంటి పథకం అమలు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీకి అవకాశం ఉన్నా ఎందుకు ఈ ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. శాశ్వత పేదరిక నిర్మూలనకు కృషి చేయలేదన్నారు. ఢిల్లీ గులాములు ఈ పనులు చేయలేవని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంటే చేస్తాయా.. వారికి ఇది చేయడానికి ఢిల్లీ అనుమతి ఇస్తుందా? అని నిలదీశారు. ఢిల్లీ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ చేయడమే వాళ్ల బతుకులు అని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. 

దళితబంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయి. ఆంధ్రాలో పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారు. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాందేడ్‌, రాయచూర్‌ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయి. దేశ విదేశాల్లో రాష్ట్ర  ప్రతిష్ఠ ఇనుమడిస్తోంది. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తోందని అడిగారు. సాహసం లేకుంటే ఏ కార్యం సాధ్యం కాదు. కలలు కని.. ఆ కలలనే శ్వాసిస్తే సాకారమవుతాయి.. అని కేసీఆర్‌ అన్నారు.  

నేడు అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని తెలిపారు. లక్షా 50వేల కోట్ల ఐటి ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. పంజాబ్‌ను తలదన్ని వరి ఉత్పత్తిలో అగ్రభాగాన నిలిచిందని సీఎం అన్నారు. విద్యుత్ సగటు వినియోగంలో నంబర్ వన్‌లో ఉందన్నారు. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా కాపీ కొట్టబడుతున్నాయని అన్నారు. 

ఏపీ పర్ క్యాపిట ఆదాయం లక్షా70వేల కోట్లు, తెలంగాణ పర్ క్యాపిట ఆదాయం 2లక్షల ముప్పై వేల కోట్లు అని కేసీఆర్ చెప్పారు. నేడు తెలంగాణలో 24గంటల కరెంట్ ఉంటుంద‌ని.. ఏపీలో కరెంట్ కోతలు ఉన్నాయంటూ పరువు తీసేశారు. ఎక్కడి తెలంగాణ, ఎక్కడి ఏపీ.. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఏమాత్రం పొంతన లేదంటూ.. ప‌రోక్షంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌ను ఎత్తిచూపారు సీఎం కేసీఆర్‌.