ప్రభుత్వ పథకం ముసుగులో పార్టీ ఎజెండా.. వారెవ్వా కేసీఆర్

మోస్ట్ పాపులర్ లీడర్ కేసీఆర్ ఎప్పుడూ మొహంమాటం లేకుండా మాట్లాడతారు. ఏదైనా దర్జాగానే చేస్తారు.. అవతలి వ్యక్తిని నిర్వీర్యం చేసినా, తాను నిస్సిగ్గుగా మాట్లాడినా... ఏం చేసినా బాజాప్తా చేయడమే తన మార్క్ అంటారు కేసీఆర్. దళితబంధు ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ లో కూడా అదే జరిగింది. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో ప్రభుత్వ కార్యక్రమం ముసుగులో పార్టీ  కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 500 మంది దళిత ప్రజలు, అధికారులు, ఇతర పార్టీల దళిత నేతలతో హుజూరాబాద్ ఎన్నికకు సమర శంఖం పూరించారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉందని, వచ్చినవారంతా ఆ దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దళిత బంధు అనేది ఒక కార్యక్రమం కాదని, ఓ ఉద్యమమని జనమంతా ఆశ్చర్యపోయేలా ఓ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. 

దీన్నే ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక అనేది పార్టీలకు సంబంధించిన వ్యవహారమని, అన్ని పార్టీల్లాగే టీఆర్ఎస్ కూడా ఎన్నికల బరిలో పోటీ పడాల్సిందే తప్ప... ప్రభుత్వంలో ఉన్నాం కదాని ఏకంగా ప్రభుత్వాధికారిక స్థలాన్నే పార్టీ ఆఫీసుగా మార్చుకొని స్పీచ్ లు దంచడమేంటని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 430 మందిని, వారితో పాటు సమన్వయకర్తలు, స్థానిక నాయకులు, అధికారులు కలుపుకుంటే 500 మందికి పైనే అవుతున్నారు. వారిని 15 వాహనాల్లో అధికారిక ప్రగతిభవన్ కు తరలించడం అక్కడ మీటింగ్ లో నిస్సిగ్గుగా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపుకోసం పిలుపునివ్వడంపై తీవ్రస్థాయిలో ప్రజలు విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ ఫేస్ చేయాల్సిన హుజూరాబాద్ ఎన్నికను దళితబంధు అనే ప్రభుత్వ పథకం కిందికి తీసుకురావడం ముఖ్యమంత్రి హోదానే అవమానపరచడంగా భావిస్తున్నారు. తాను ఓడిపోతున్నానని తెలిసే కేసీఆర్  ఇంతలా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చులతో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టుకునే కురుచ బుద్ధికి నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దళితబంధు పైలట్ ప్రాజెక్టు ప్రారంభానికి అయిన ఖర్చెంతో తెలంగాణ ప్రజల ముందుంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

కేసీఆర్ ఒంటెత్తు పోకడలకు మరో నిదర్శనం
ముఖ్యమంత్రి హోదాలో ఒంటెత్తు పోకడలు పోయే వ్యక్తిగా కేసీఆర్ ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకు నిదర్శనంగా లెఫ్ట్ పార్టీల నుంచి పలువురు నేతలను ప్రగతి భవన్ కు ఆహ్వానించడాన్ని ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమైన దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు లెఫ్ట్ నాయకులు తప్ప ఇతర పార్టీ నాయకుల్ని ఎందుకు పిలవలేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ విషయాన్ని కావాలనే విస్మరించారా... కేసీఆర్ కు నచ్చినట్టు చేయాలన్న ఉద్దేశంతోనే సీఎస్ అసలు విషయాన్ని పక్కన పెట్టారా.. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తితే దానికి సీఎస్ ఏమని జవాబిస్తారు.. అన్న ప్రశ్నాస్త్రాలతో విపక్షాలు రెడీ అవుతున్నాయి. సీపీఎం జాతీయ స్థాయి నాయకుడు వెంకట్ తో పాటు సీపీఐ రాష్ట్ర స్థాయి నాయకుడైన బాలనరసింహను కేసీఆర్ ఆహ్వానించారు. హుజూరాబాద్ ఎన్నిక తరువాత యావత్ తెలంగాణలో దళిత బంధు పథకం విజయవంతం అయ్యాక దేశమంతా దాని అమలు కోసం కేంద్ర సర్కారు మీద ఒత్తిడి తెస్తామని, హుజూరాబాద్ లో ఫెయిలైతే దాని పరిణామాలు ఆ తదుపరి చాలా తీవ్రంగా పడతాయని, అందువల్ల దీన్నో యజ్ఞంలా భావించి హుజూరాబాద్ లో పని చేయాలని నిర్మొహమాటంగా లెఫ్ట్ నాయకులు స్టేట్ మెంట్లు ఇవ్వడం గమనార్హం. 

కేసీఆర్ ఇటీవల.. తమదేం సన్నాసుల పార్టీ కాదని, తమ లాభం తాము చూసుకుంటామని, గెలవడం కోసమే పని చేస్తామని, తమది ఫక్తు రాజకీయ పార్టీయేనంటూ మరోసారి నిర్లజ్జగా బయటకు కక్కేశారు. అదే కేసీఆర్ అసలు నైజం అంటూ ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, ఇతర పౌర సంఘాల ప్రతినిధులు మరోసారి గుర్తు చేస్తున్నారు.