నార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టాలి : సీఎం చంద్రబాబు
posted on Sep 23, 2025 6:14PM
.webp)
ఆంధ్రప్రదేశ్‌లో 90 శాతం సిజేరియన్ ఆపరేషన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వం సహించదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ, “ఎప్పుడైనా సరే ఆపరేషన్ అంటే శరీరాన్ని కోయడమే. సహజసిద్ధమైన ప్రసవాన్ని ప్రోత్సహించాలి.
సిజేరియన్‌లలో అగ్రస్థానంలో ఉండటం సరికాదు. దీన్ని నియంత్రించే మార్గాలపై ఆలోచించాలి” అన్నారు. దేశంలో అత్యధికంగా ఏపీలో సిజేరియన్ డెలివరీలు (56.62%) జరుగుతున్నాయి. ఇది డేంజరస్ ట్రెండ్ అన్నారు. గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని, యోగా వంటి సాధనాలను నేర్పే పరిస్థితి రావాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ను పిలిచి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన అందరి లక్ష్యం. వచ్చే ఏడాదికే రాష్ట్ర జనాభా 5.37 కోట్లకు చేరుకోనుంది. దేశ జనాభా 2047 నాటికి 162 కోట్లకు చేరుతుందని అంచనా. యూపీ, బిహార్ వల్లే భారత్‌లో జనాభా సమతుల్యం అవుతోంది. ఏపీలో పీహెచ్‌సీలు జాతీయ సగటు కంటే ఎక్కువే ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మన రాష్ట్రంలో మెడికల్ ఆఫీసర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు” అని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 1.15 లక్షల మంది వైద్యులు ఉన్నారని, దేశ సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉందని సీఎం తెలిపారు. “ఇమ్యూనైజేషన్‌లో 97 శాతం విజయాన్ని సాధించాం. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో 78 శాతం పురోగతి ఉంది, త్వరలోనే వందశాతం సాధిస్తాం. గర్భిణీల్లో అనీమియా 32 శాతం ఉన్నా, దీన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నాం” అని సీఎం చంద్రబాబు వివరించారు.