భారత్ జోడో యాత్రలో తారల తళుకు బెళుకులు

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళనాడులోని కన్యా కుమారిలో సెప్టెంబరు 7న తొలి అడుగు పడింది మొదలు, మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా,ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుడా, సాఫీగా సాగిపోతోంది. చివరకు, రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో పాదయాత్ర చేయలన్నా,అవరోధాలు, అరెస్టులు తప్పని, తెలంగాణ రాష్ట్రంలోనూ రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే, రాష్ట్రం దాటేసింది. ఇంతవరకు 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా నడిచిన రాహుల్ యాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో సాగుతోంది. రేపో మాపో రాజస్థాన్ లో ప్రవేశిస్తుంది. నిజానికి, రాజకీయ నాయకుల పాదయాత్ర అంటే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండకచో కొద్దిమంది ఇతర రంగాల సెలబ్రిటీలు మాత్రమే పాల్గొంటారు. కానీ, రాహుల్ యాత్రలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే, సెలబ్రిటీలే ఎక్కువగా పాల్గొంటున్నారా అన్నట్లుగా, యాత్ర చాలా కలర్ ఫుల్’గా సాగుతోంది. సినిమా స్టార్లే కాదు, కాలేజీ అమ్మాయిలు, విద్యార్ధులు, యువకులు, చివరకు చిన్న పిల్లలు కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు.
సహజంగా రాజకీయ నాయకుల పాదయాత్రలలో గంభీర ఉపన్యాసాలు, సీరియస్ చర్చలు ఉంటాయి. జెండాలు, స్లొగన్స్ ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ యాత్రలో రాజకీయ వాసనలు అంతగా కనిపించడం లేదు. రాహుల్  యాత్ర ఒక పిక్నిక్ లాగా సాగిపోతోందని, పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఆట పాటలు, సెల్ఫీ

లు, కరచాలనాలు, హగ్గులు, ఆలింగానాలు ఒకటని కాదు, ఒక ప్రత్యేక పంధాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. అయితే, ఈ యాత్ర వలన అంతిమంగా ఏమి జరుతుగుంది, ఏమి జరగదు అనేది పక్కన పెడితే, రాహుల్ యాత్ర పాదయాత్రల చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని అయితే, చెప్ప వచ్చును. 

రాహుల్‌ గాంధీ మొదలుపెట్టిన భారత్‌ జోడో యాత్రకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై తమ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటి స్వరా భాస్కర్‌ పాల్గొన్నారు. మధ్య ప్రదేశ్ లోని  ఉజ్జయినిలో రాహుల్ గాంధీ వెంట స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో నడిచారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనండి.. మన దేశం కోసం నిలబడండి అని స్వరా భాస్కర్ పిలుపునిచ్చారు. అంతే కాదు, రాహుల్ గాంధీకి, ఆమె ప్రేమ పూర్వకంగా రోజా పూలిచ్చారు. ఫోటోలకు ఫోజులిచ్చారు, ఇందుకు సంబందించిన ఫొటోలను కాంగ్రెస్‌  తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. 

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూనమ్‌ కౌర్‌, పూజా భట్, రియా సేన్, మోనా అంబేగావ్కర్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరీ పాదయాత్రలో పాల్గొన్నారు. హాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ కుసాక్‌ కూడా రాహుల్‌కు ట్విటర్‌ వేదికగా మద్దతు ప్రకటించారు. భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది.

ఇదలా ఉంటే,భారత్ జోడో యాత్రపై, కొందరు సీనియర్ నాయకులు కొంత అసంతృప్తి వ్యక పరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన కామెంట్లు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి.ప్రస్తుతం రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతుండగా.. షెడ్యూల్ కఠినంగా రూపొందించడంపై కమల్ నాథ్ అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రతో చచ్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదీప్ మిశ్రా అనే పండితుడితో ఆయన మాట్లాడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నం.. ఇక్కడ రెండే నిబంధనలు ఉన్నాయి.

ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభించాలి. రోజులో కనీసం 24 కిలోమీటర్లు నడవాలి. అంతే కాకుండా మధ్యప్రదేశ్ లో యాత్రకు రాహుల్ ముందే మూడు కండీషన్లు పెట్టారు. ఆదివాసీ వీరుడు తాంత్య భీల్ జన్మస్థలం, ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహంకాళి ఆలయాలను సందర్శించాలని షరతు పెట్టారు అని కమల్ నాథ్ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇటీవల పాదయాత్రలో దిగ్విజయ్ సింగ్ జారిపడిన నేపథ్యంలో కమల్ నాథ్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.  నిజానికి రాహుల్ గాంధీ, సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించిన  జోడో యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల గుండా 3,570 కిలోమీటర్లు ప్రయాణించి కశ్మీర్ చేరుకునేలాప్లాన్ చేశారు.

ఈ యాత్ర ఇప్పరికే  సగం దూరం దాటేసింది. ఈరోజు (శుక్రవారం) 84వ రోజుకు చేరింది.మరో 1200 కిలోమీటర్లు నడిస్తే, యాత్ర పూర్తవుతుంది.యాత్ర పూర్తవుతుంది కానీ  యాత్ర లక్ష్యం అది భారతీయలను కులాలు, మతాలకు అతీతంగా ఏకం చేయడమే అయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే అయినా, 2024 ఎన్నికల నాటికి రాహుల్ గాంధీని మోడీకి సమ ఉజ్జీగా నిలపడమే అయినా నెరవేరుతుందా? ఇప్పడు యాత్రలో పాల్గొంటున్న నాయకులనే కాదు కాంగ్రెస్ నేతలు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.