చిదంబరం ఆయన కొడుకు ఇళ్లలో సీబీఐ సోదాలు..
posted on May 16, 2017 1:37PM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం నివాసంలో ఈరోజు సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సోదాలు చేసింది. చిదంబరం ఇంట్లోనే కాదు ఆయన తనయుడు కార్తీ చిదంబరం ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, నోయిడా, చెన్నై ఇలా చిదంబరం కు సంబధించిన పలు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విదేశీ పెట్టుబడులు తీసుకునేందుకు ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపునకు లంచం తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఈ సోదాలు చేస్తున్నారు.
కాగా, ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన తనయుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి.. చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతించారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఐటీశాఖ పలుసార్లు చిదంబరం నివాసాలపై దాడులు చేపట్టింది. దీనికి సంబంధించిన నివేదిక కూడా రూపొందిస్తున్నట్లు ఇటీవల ఐటీ శాఖ సుప్రీం కోర్టుకు తెలిపింది.