దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు నమోదైంది. నిత్యం వివాదాలతో సహవాసం చేసే రామగోపాల వర్మ వివాదాలను ఆహ్వానించి మరీ వార్తల్లో నిలుస్తారని ప్రతీతి. తాజాగా ఆయనపై ఓ చీటింగ్ కేసు నమోదైంది. నిజానికి రామ్ గోపాల్ వర్మకు వివాదాలేమీ కొత్త కాదు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని ఆయనే సృష్టించి మరీ  వార్తల్లో ఉండడం ఆయన హాబీ. తన దైన శైలిలో ట్విటర్ వేదికగా ట్వీట్లు చేసినా,   ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా అవి వివాదాస్పదమైనవే అయి ఉంటాయి. వివాదాల సృష్టి కోసమే ఆయన ఆలోచిస్తుంటారనడం సబబేమో అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. 

తాజాగా హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై చీటింగ్ కేసు నమోదైంది. దీంతో ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆర్జీవీ చీటింగ్ చేశారంటూ శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని కొప్పాడ శేఖర్ రాజు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వర్మ మరో వివాదంలో చిక్కుకున్నట్లయింది. కొన్ని సంవత్సరాలుగా ఆర్జీవీ తాను తెరకెక్కిస్తున్న మూవీలు, వ్యవహార శైలితో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
‘ఆశ ఎన్ కౌంటర్’ సినిమా ఒకటి ఆర్జీవీ సమర్పణలో విడుదలైంది. 2019 నవంబర్ లో హైదరాబాద్ నగర శివార్లలో ఒక వెటర్నరీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన, నిందితుల ఎన్ కౌంటర్ ఘటన ఆధారంగా ఆశ ఎన్ కౌంటర్ మూవీని రూపొందించారు. ఆ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. అనేక సార్లు అది రిలీజ్ కాకుండా వాయిదాలు పడింది. చివరికి ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథ ఇక్కడితో ముగియలేదు.

కొద్ది రోజుల క్రితం శేఖర్ రాజుకు ఓ కామన్ మిత్రుడి ద్వారా ఆర్జీవీ పరిచయం అయ్యారట. వర్మకు తాను 2020 జనవరిలో 8 లక్షలు, మరి కొన్ని రోజుల అనంతరం మరో 20 లక్షలు, మళ్లీ 28 లక్షలు ఇచ్చినట్లు ఆయన తన ఫిర్యాదులో శేఖర్ రాజు పేర్కొనడం గమనార్హం. ఈ మొత్తాలన్నీ కలిపి ‘ఆశ ఎన్ కౌంటర్’ మూవీ రిలీజ్ కు ముందే ఇచ్చేస్తానని ఆర్జీవీ హామీ ఇచ్చారని శేఖర్ రాజు చెబుతున్నారు. తీరా ఆ మూవీ రిలీజ్ అయిపోయింది. వర్మ తనకు మాట ఇచ్చిన సమయం కూడా దాటిపోయింది. ఆశ ఎన్ కౌంటర్ మూవీకి ఆర్జీవీ నిర్మాత కాదని శేఖర్ రాజుకు తెలిసిందట. దీంతో తాను మోసపోయానని, ఆర్జీవీ తనను చీట్ చేశారంటూ మియాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిత్య వివాదాల దర్శకుడు మరోసారి చీటింగ్ వివాదాన్ని తన తలపైకి తెచ్చుకున్నట్లయింది. అయితే.. ఈ చీటింగ్ కేసు విషయమై ఇప్పటి వరకూ రామ్ గోపాల్ వర్మ స్పందించకపోవడం గమనార్హం.