ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న!.. రామ్‌నాథ్‌కు చంద్ర‌బాబు బృందం ఫిర్యాదు..

జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో జ‌రుగుతున్న అరాచ‌కాల‌పై రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఫిర్యాదు చేశారు చంద్ర‌బాబు. ఏపీలో మాదక ద్రవ్యాల దందా, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యలయాలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం, కోర్టు ఆదేశాల ధిక్కరణ, ఆర్ధిక దివాళా, ప్రభుత్వానికి అధికార పార్టీకి పోలీసుల గులాంగిరి.. తదిత‌ర‌ అంశాలను టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులు పెట్టి వేధించడంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం కుంటుపడిందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి టిడిపి నేతలు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రపతి రామ్‌నాత్ కోవింద్‌తో చంద్ర‌బాబు బృందం భేటీ సందర్భంగా ఏపీలో ఘటనలపై నివేదిక అందజేశారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతోందని కంప్లైంట్ చేశారు. చంద్ర‌బాబు వెంట టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కేశినేని నాని, అచ్చెన్నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహా పలువురు నేతలున్నారు. మరోవైపు రాష్ట్ర పరిస్థితులు వివరించేందుకు ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్‌షాను టీడీపీ అపాయింట్‌మెంట్ కోరింది.