'డు నాట్ డిస్ట్రబ్ మీ'.. మదమా? కొవ్వా?

"మీరు అసలు మనుషులేనా.. ఇదేనా పాలన? దోచుకోవడం.. దాచుకోవడం తప్ప.. వైసీపీ పాలనలో మరేమీ లేదు. సీఎం జగన్ మొద్దు నిద్ర పోతున్నారు. జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయి. మదమా.. కొవ్వా అర్థం కావడం లేదు." అంటూ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. 

తిరుపతి ఎన్నికల ప్రచారం ముగించి మీడియాతో మాట్లాడారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో విస్తృతంగా తిరిగానని.. ప్రజల్లో ఎంతో ఆవేదన ఉందని అన్నారు. అప్పులు చేయడంలో ఏపీని నెంబర్ వన్‌గా నిలబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువగా ఉంది. అక్రమ కేసులు బనాయిస్తూ, అమాయకులను హత్య చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. సీఎం జగన్ 'డు నాట్ డిస్ట్రబ్ మీ' అని బోర్డు పెట్టారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి అసలేమీ పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు. 

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల ఇస్తే... వచ్చే నెల ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. కుక్కలు చింపిన విస్తరిలా పాలన మారింది. ఎక్కడికక్కడ అప్పులు చేస్తున్నారు. ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేదు. సీపీఎస్ అతీగతీ లేదు. పీఆర్సీ కమిటీ వరకే ఆగిపోయింది. ఫీరీయింబర్స్‌మెంట్ సకాలంలో ఇవ్వడంలేదని, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

పాలనానుభవం లేకపోవడంతో.. జగన్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సీఎం ఉన్నాడు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 164 ఆలయాలపై దాడులు జరిగితే.. ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్థంలో నాపై కేసులు పెట్టారు. తిరుపతిలో రాళ్లు వేస్తారు. నన్నే సాక్ష్యం ఇమ్మంటున్నారు. ఈ సీఎం ఆనందిస్తున్నాడు తప్ప.. తప్పును సరి చేసుకోవడం లేదు’’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు చంద్రబాబు.