అప్పుడు ముద్దులు... ఇప్పుడు గుద్దులు...

విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పెందుర్తిలో రోడ్‌షో ప్రారంభించిన చంద్రబాబు.. పెందుర్తి, చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం జంక్షన్లలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. అరాచక పాలకులకు మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని చంద్రబాబు ప్రజలను కోరారు. అరాచక పాలనను అంతమొందించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలన్నారు. అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకురావాలి.  అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలి... బొబ్బిలి పులిలా గాండ్రించాలి అంటూ చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నికలలో పోటీచేసే మా పార్టీ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు. ఈ రాష్ట్రమేమైనా వీళ్ల అబ్బ సొత్తా?  వీళ్లను ఇలాగా విడిచిపెడితే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు అన్నారు.

ఆంధ్రుల పోరాటాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏ-1, ఏ-2లు దొంగనాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘దక్షిణకొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీ తనకు తెలియదని సీఎం బుకాయించారు. పార్లమెంటులో మంత్రి సమాధానంతో అడ్డంగా దొరికిపోయారు. పోస్కోతో స్టీల్‌ప్లాంట్‌ నాన్‌బైండింగ్‌ ఒప్పందం బట్టబయలు కావడంతో వీరి కుట్రలు ప్రజలకు తెలిశాయి అని చంద్రబాబు చెప్పారు. ఉక్కు భూములను అమ్మేయడానికి ఎన్‌బీసీకి అధికారం ఇచ్చారన్నారు. భూములన్నా.. డబ్బులన్నా ఈ సీఎంకు పిచ్చి..రాష్ట్ట్రంలో ఆస్తులను అమ్మేస్తున్నారు. భవిష్యత్తులో అందరినీ అమ్మేస్తారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యం నడుస్తోందనీ, ఏ, బీ, సీ, డీ పాలసీతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘సొంత చెల్లెల్ని రోడ్డున పడేసినవ్యక్తి, రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ‘‘ఈ ముఖ్యమంత్రి ఒక పిల్లకుంక. నా అనుభవం అంత లేదు నీ వయసు. నీ తండ్రే నన్నుచూసి భయపడేవాడు. ఆయన కంటే నేనే ముందు సీఎం అయ్యాను. ఎవరైనా మంచి చేసి ఓట్లు అడుగుతారు. కానీ జగన్‌ బ్యాచ్‌ బెదిరించి ఓట్లు అడుగుతున్నారు. ప్రశాంత విశాఖకు ఏ-2 శని పట్టింది. నెల్లూరులో ఉండాల్సిన ఈ వ్యక్తికి విశాఖలో ఏం పని? ఇక్కడ అరాచకాలకు, భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యక్తిని విశాఖ ప్రజలు తరిమికొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

జగన్‌ ఒక స్టిక్కర్‌, ఫేక్‌ సీఎం అని చంద్రబాబు దుయ్యబట్టారు. 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌, అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులు పేరిట గుద్దులే.. గుద్దులే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.