పరుగులు తీయాలి ఓ నేతలూ ఉరకలు వేయాలి.. చంద్రబాబు దిశా నిర్దేశం

వచ్చే ఏన్నికలలో  టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న తన   శపథాన్ని నెరవేర్చుకునేందుకు సమరసన్నాహాలు చేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాల పేరుతో ఒక్కో జిల్లాలో మూడేసి రోజులు పర్యటించిన చంద్రబాబు నాయుడు తాజాగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు ప్రారంభించారు.

నియోజకవర్గాల వారీగా టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ ఇన్ చార్జిలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇలా రోజుకు ఐదు నియోజకవర్గాల వంతున సమీక్షించి, నేతలను ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. పార్టీ ఇన్ చార్జిలతో వేర్వేరుగా చిట్ చాట్ లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీల బలా బలాలు, రాజకీయ పరిణామాల గురించి వివరంగా తెలుసుకుంటున్నారు. తాజాగా చేయించిన సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని మరీ చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు ఇస్తుండడం విశేషం.

మరో పక్కన 2014 ఎన్నికల తర్వాత బీజేపీకి దూరం అయిన చంద్రబాబు ఈ మధ్య కాలంలో మళ్లీ ఆ పార్టీ ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం విశేషం. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తనను అవమానించిన వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు వచ్చే ఎన్నిక తల బొప్పి కట్టించి, బొమ్మ కనిపించేలా చేసేందుకు అవసరమైన అన్ని వ్యూహాలకు చంద్రబాబు పదును పెడుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు లేదా పొత్తు కుదుర్చుకునే వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఆయన మొన్నటికి మొన్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘పై ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని నిమిషాల పాటు చంద్రబాబుతో చేయి కలిపి మరీ ప్రధాని మోడీ ప్రత్యేకంగా చర్చించడం అందరినీ ఆకర్షించింది. త్వరలోనే మరోసారి చంద్రబాబు ఢిల్లీ టూర్ కు వెళ్లనున్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తుండడం గమనార్హం.

నిజానికి ఏపీలో టీడీపీ తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేందుకు చంద్రబాబు సర్వేలు చేయిస్తుంటారు. దాంతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బృందం కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు సొంత టీమ్ తో సర్వేలు చేయిస్తూ ఉంటారు. దీంతో పాటు ఈసారి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీంతో కూడా ఆయన సర్వే చేయించారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

అలాగే లోకేష్ టీం మరో సర్వే చేయించిందంటున్నారు. ఈ మూడు సర్వేల్లో కూడా 40 నియోజకవర్గాల్లో టీడీపీ- వైసీపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొన్నట్లు నివేదికలు వచ్చాయంటున్నారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న చంద్రబాబు తన శపథం నెరవేర్చుకునేందుకు ఇప్పుడు అలాంటి నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించారని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

మే 29, 29 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో నిర్వహించిన టీడీపీ మహానాడు ఊహలకు మించి  సక్సెస్ అయింది. దీంతో టీడీపీ నేతలు, శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అదే స్ఫూర్తితో ఏపీ వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు, మినీ మహానాడు కార్యక్రమాలు కూడా విజయవంతం అయ్యాయి. అప్పటి నుంచి టీడీపీ నేతలు, శ్రేణుల్లో కూడా హుషారు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తమ అధినేత నిర్దేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ వైఫల్యాలు, అవినీతి, అసమర్థ పాలనపై విరుచుకుపడుతూనే ఉన్నారు.

టీడీపీ అభ్యర్థుల విషయంలో దూకుడు ప్రదర్శించాలని, ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలనే యోచన కూడా చంద్రబాబు చేస్తున్నారని అంటున్నారు. దాంతో పాటు లోకేష్ కూడా దూకుడు పెంచారనీ, సీఎం జగన్ రెడ్డి రహస్యాలను బహిర్గతం చేసేందుకు రెడీ అయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో జగన్ కు సంబంధించిన అతిపెద్ద కుంభకోణం బయట పెడతానంటూ లోకేష్ ఇటీవల ప్రకటించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు ఒక పక్కన, నారా లోకేష్ మరో పక్కన టీడీపీని బలోపేతం చేస్తూనే.. అధికార వైసీపీ విధానాలపైన నిరంతరం పోరాటం చేయాలని పథకం రూపొందించారట. తద్వారా వచ్చే ఎన్నికలను తమకు సానుకూలం చేసుకుకేందుకు పక్కా ప్రణాళికతో వేగంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.