ప్ర‌త్య‌ర్థుల‌పై దేశ‌ద్రోహం కేసా? అధికారులు శిక్షార్హులే.. చంద్ర‌బాబు వార్నింగ్‌

ఎంపీ రఘురామకృష్ణరాజుపై తప్పుడు కేసులు పెడితే తాము మాట్లాడకూడదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఎవరికి అన్యాయం చేసినా నిలదీసేందుకు తమ పార్టీ ముందుంటుందన్నారు.  రాష్ట్రం అంటే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదన్నారు. రఘురామ అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదన్నారు. అధికారులు హద్దులు మీరి ప్రవర్తించడం సరికాదని, చట్టానికి లోబడే పనిచేయాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులు కూడా శిక్షార్హులే అవుతారని చంద్రబాబు అన్నారు.  

ప్రజాస్వామ్యవాదుల పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యర్థులపై దేశద్రోహం పెడతారని తనకు తెలియదని, మీడియాపైనా రాజద్రోహం కేసు పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు. వాస్తవాలు రాయకుండా మీడియా నియంత్రణకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చట్ట ఉల్లంఘనలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు గమనించాలని సూచించారు. తామెప్పుడూ కుల ప్రస్తావనతో ఎదురుదాడి చేయలేదని చంద్రబాబు అన్నారు. కోర్టు సెలవులు చూసి మరీ జేసీబీలతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని, హద్దు దాటే అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు.