విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయం! జగన్ రెడ్డిని పట్టించుకోని కేంద్రం..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే సమస్యే లేదు .. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకుని తీరుతాం.. ఇదీ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చెబుతున్న మాట. ఇటీవలే ఆయన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో కలిసి ఢిల్లీలో  హడావుడి కూడా చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వైసీపీ నేతలు తాము ఏదో చేస్తున్నామనే ప్రయత్నం చేస్తుండగా.. అటు కేంద్ర సర్కార్ మాత్రం తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. జగన్ రెడ్డి సర్కార్ వినతులను కనీసం పట్టించుకోకుండా ముందుకు పోతోంది. 

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ మరో షాకిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం తరపున కార్యదర్శి ఆర్కే సింగ్ ఈ మేరకు దాఖలు చేశారు. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే.. స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేంద్రం పూర్తిస్థాయిలో పెట్టుబడులు ఉపసంహరించాలని కేబినెట్ కమిటీ నిర్ణయించడంతో ఈ ఏడాది జనవరి 27నే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.సీబీఐ మాజీ జేడీ.. వీవీ లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం దారుణమని.. దీనికి రాజ్యాంగం సైతం అంగీకరించదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై పలు దఫాల విచారణ అనంతరం.. తాజాగా.. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

అఫిడవిట్‌లో కేంద్రం దేశ ఆర్థిక వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆర్కే సింగ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇలాంటివాటిపై గతంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందన్నారు. కేంద్రం కేబినెట్ కమిటీలో ప్రధాని, ఆర్థికమంత్రి, హోంమంత్రి, ఉక్కుమంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, పెట్రోలియం మంత్రి సభ్యులుగా ఉన్నారన్నారు. పూర్తి అర్హత కలిగిన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.అంతేకాదు లక్ష్మినారాయణ విశాఖ లోక్ సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారని, ఆయన ఈ పిటిషన్ ను రాజకీయ ప్రయోజనాల కోసమే వేసినట్లున్నారని కూడా తన కౌంటర్ లో కేంద్రం పేర్కొంది. 

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు వీల్లేదని.. ప్రజాసంఘాలు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. రాజకీయ నేతలు కూడా.. దీనిలో భాగమయ్యారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. తన పదవికి రాజీనామా కూడా సమర్పించారు. ఇక ప్రభుత్వం పరంగా కూడా జగన్ లేఖలు రాస్తున్నారు. రాశారు. అయితే.. జగన్ ప్రయత్నాలను మొసలి కన్నీళ్లుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొందరు న్యాయపోరాటం చేస్తున్నారు. అయినా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.