తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు? ఎప్పుడంటే.. 

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే ప్రచారం 2014 నుంచి సాగుతోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లు ఉండగా.. అది 225కు పెరగనుంది. తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో సీరియస్ గానే కేంద్ర సర్కార్ తో చర్చలు జరిపారని అంటారు. కాని అది మాత్రం సాధ్యం కాలేదు. 

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సీట్ల పునర్విభజనకు కేంద్రం సిద్దమవుతుందనే సమాచారం రావడంతో.. కశ్మీర్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే చర్చ కొన్ని రోజుల నుంచి మళ్లీ జోరుగా సాగుతోంది. అయితే అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర సర్కార్ తాజాగా మరోసారి స్పష్టత ఇచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని స్పష్టం చేసింది.

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. ‘ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవరం ఉంది. ఎప్పుడు పెంచుతారు?’ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు.

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై రాజకీయ పార్టీలు చాలా ఆశలుపెట్టుకున్నాయి. అయితే కేంద్రం తాజా స్పందనతో వారి ఆశలు ఇప్పట్లో తీరవని అర్ధమైంది. అంతేకాదు 2026 తర్వాతే పెరుగుతాయని కేంద్రం చెబుతున్నా.. ఇంకా ఎక్కువ సమయమే పట్టనుంది. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ సీట్ల పునర్విభజన ఉంటుంది. ఈ లెక్కన 2026 తర్వాత 2031లో జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ తర్వాతే పునర్విభజన ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఈ లెక్కన 2034 ఎన్నికల సమయానికి తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సీట్లు అందుబాటులోకి వస్తాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అంటే కొత్త నియోజకవర్గాలు ఏర్పడాలంటే ఇంకో 13 ఏండ్ల పాటు ఆగాల్సిందే..