పాణ్యం సాక్షిగా బైరెడ్డి, గౌరు మ‌ధ్య ర‌గులుతోన్న విభేదాలు

ఒకే ప్రాంతం, ఒకే ఊరువారు రాజ‌కీయంగా ఎంతో ఎదిగిన‌వారు ఒకే నియోజ‌క‌వ‌ర్గాన్ని చేజిక్కించుకోవ‌డంలో పోటాపోటీగా త‌మ స‌త్తాను ప్ర‌ద‌ర్శిస్తున్న‌వారు బైరెడ్డిరాజ‌శేఖ‌ర్ రెడ్డి, గౌరు వెంక‌ట‌రెడ్డి.  ఇరువురూ నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందినవారే. తండ్రి వారసత్వ రాజకీయంతో బైరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్సీనియర్‌ నేత మద్దూరు సుబ్బా రెడ్డి పిలుపుతో గౌరు వెంకట రెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1994, 1999లో బైరెడ్డి నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యేగా పని చేశారు. ఇక.. గౌరు వెంకటరెడ్డి సతీమణి గౌరు చరితారెడ్డి 2004 ఎన్నికల్లో బైరెడ్డిని ఓడించి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వి భ‌జన‌లో భాగంగా నందికొట్కూరు జ‌న‌ర‌ల్ నుంచి ఎస్పీ రిజ‌ర్వుడుగా మారింది. 

ఈ కార‌ణంగా బైరెడ్డి, గౌరు రెడ్డి కుటుంబాలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాన్ని పాణ్యానికి మార్చాయి. అక్క‌డా నువ్వా నేనా అన్నంతా రాజ‌కీయాలు న‌డిచాయి. 2019 ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు వారిద్ద‌రిని ఒక‌టి చేశారు. ఫ‌లితంగా ఆ ఎన్నిక‌ల్లో గౌరు బావ మాండ్ర శివానంద రెడ్డి నంద్యాల టీడీపీ అభ్య‌ర్ధిగా పోటీచేసిన‌పుడు ఇద్ద‌రూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తునిచ్చి ప్ర‌చారం చేశారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆయ‌న ఓడిపోయారు. 

ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో తలెత్తిన పరిస్థితులతో బైరెడ్డి, ఆయన కూతురు శబరి బీజేపీలో చేరారు. అటు.. 2019 ఎన్ని కల్లో పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసిన గౌరు చరితారెడ్డి ఓడిపోయారు.  ఓటమి చెందినప్పటికీ గౌరు ఫ్యామిలీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. మూడేళ్ల నుంచి బైరెడ్డి, గౌరు.. ఎవరి పార్టీ కార్యక్రమాల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. అయితే.. ఇటీవ‌ల  పిన్నాపురంలో నెలకొన్న సమస్యలపై బైరెడ్డి సీరియస్‌గా స్పందించారు. గ్రీన్ కో కంపెనీ నిర్మించే పవర్ ప్రాజెక్టులతో పిన్నాపురానికి ఇబ్బందులు తలెత్తుతాయని, ముఖ్యంగా.. రిజర్వాయర్ ఆనకట్ట గ్రామానికి అతి సమీపంలో ఉండ‌డంతో  ముప్పు వాటిల్లే అవకాశం ఉందని బైరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా,  గ్రీన్ కో ప్రాజెక్టుపై గ్రామస్తులు ఆందోళన చేస్తుంటే.. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న గౌరు వెంకటరెడ్డి  ఆ కంపెనీ తో త‌లెత్తే  సమ స్యలను నిర్ల‌క్ష్యం చేశార‌ని  బైరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల తరుపున పోరాడాల్సిన ప్రతిపక్ష నేతలు  పోలీసుల చేత ముందే హౌస్ అరెస్టులు చేయించుకుని. ఆందోళనలు చేస్తున్న ట్లు నటిస్తున్నారని బైరెడ్డి విమర్శించారు. 

ఇదిలా ఉండ‌గా,  బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గౌరు గ‌ట్టిగానే స‌మాధానం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరెంత సంపాదించుకున్నారో చర్చించుకుందామ‌ని.. బైరెడ్డికి సవాల్ విసిరారు. పాణ్యంలోని పరిశ్రమల యజమానులు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకున్నట్లు ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్‌ చేశారు.