బడంగ్ పేట్ మేయర్ టీఆర్ఎస్ కు గుడ్ బై

తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు జరుగుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బడంగ్ పేట్ మేయర్ పార్టీకి రాజీనామా చేశారు. నిన్న కాక మొన్న బీజేపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి తెరాస గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి బడంగ్ పేట మేయర్ రాజీనామా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపారు. బడంగ్ పేట్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం విజయవంతం చేశానని ఆ లేఖలో పారిజాత నరసింహారెడ్డి పేర్కొన్నారు. కాగా తన రాజీనామా విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మీడియాకు తెలిపిన పారిజాత నర్సింహారెడ్డి పార్టీకి అంకిత భావంతో సేవలందించినా, ఇటీవలి కాలంలో పార్టీలో గుర్తింపు కరవైందనీ, అవమానాలు ఎదురౌతున్నాయనీ పేర్కొన్నారు.

ఆత్మ గౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.  ఒక తెలంగాణ బిడ్డగా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. పార్టీలో సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని ఆమె అన్నారు.