ఆ  ఆస్తుల పంప‌కానికి చ‌ట్ట‌మా?.. ఆగ్ర‌హించిన ఏపీ హైకోర్టు

స్కూల్లో ఇద్ద‌రు స్నేహితులు వాదించుకుంటున్నారు.. నోట్‌బుక్ గురించి. ఒక‌రి నోట్‌బుక్  ఈ  ఇద్ద‌రు కాకుండా వేరే విద్యార్ధి ద‌గ్గ‌రికి వెళ్లింది. తానివ్వ‌కుండా నా నోట్సు వాడి ద‌గ్గ‌రికి ఎలా వెళ్లింద‌ని మొద‌టి వాడు ప్ర‌శ్నించాడు. నేనే ఇచ్చాన‌న్నాడు రెండో వాడు. నా వస్తువును న‌న్ను అడ‌క్కుండా, ప‌ర్మిష‌న్ తీసుకోకుండా ఎలా ఇచ్చావ‌ని నిల‌దీశాడు. పెద్ద గొడ‌వే అయింది. కొంత‌సేప‌టికి ఎలాగో శాంతించారు. ఇందుకు భిన్నంగా లేదు.. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ ప‌ని. సింహాచ‌లం వ‌రాహ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి దేవ స్థానానికి చెందిన పంచ‌గ్రామాల భూము ల్ని ఆక్ర‌మ‌ణ‌దారుల పేరు మీద  క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. అందుకు ఏకంగా చ‌ట్టం కూడా తెచ్చింది. హై కోర్టు ఆగ్ర‌హించింది. మీది కాని ఆస్తిని వేరొక‌రికి పంచేందుకు చ‌ట్టం ఎలా చేస్తార‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. 

ఇలాంటి చ‌ర్య‌ల్ని అనుమ‌తిస్తే, పేద‌ల‌కు పంచుతున్నామ‌నే పేరుతో ప్రైవేటు వ్య‌క్తుల భూముల్ని సైతం స్వాధీనం చేసుకొని ప‌రిహారం చెల్లించామ‌ని చెప్పే ప్ర‌మాధం ఉంద‌ని హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌ మూర్తి జ‌స్టి స్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, జ‌స్టిన్ డీవీఎస్ సోమ‌యాజులుతో కూడిన ధ‌ర్మాస‌నం గురువారం వ్యాఖ్యానించింది. వ్యాజ్యాల‌పై తుది వాద‌న‌లు వినిపించేందుకుసిద్ధ‌మై రావాల‌ని ఇరుప‌క్షాల న్యాయ‌ వాదుల‌కు స్ప‌ష్టం చేసింది. విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. 

పంచగ్రామాల భూములను ఆక్రమణదారుల పేరిట క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన చ‌ట్టాన్ని విజయవాడకు చెందిన రామనాథం రామచంద్రరావు హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆక్రమణల క్రమబద్ధీకరణకు రుసుమును ఖరా రు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 229ని చట్ట విరు ద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.  విచారణ జరి పిన హైకోర్టు భూముల క్రమబద్ధీకరణపై యథాతథ స్థితి పాటించాలని 2019 ఏప్రిల్‌ 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపించారు. దేవాల యాల భూములను విక్రయించడానికీ, క్రమబద్ధీకరించ డానికీ వీల్లేదని హైకోర్టు 2005 లో తీర్పు ఇచ్చిం ది.  ఆ  ఆదేశాలను అధిగమించేందుకు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దేవ స్థానం కోల్పోయే భూము లకు తగినంత పరిహారం లభించడం లేదు. చట్టాన్ని రద్దు చేయమ‌ని కోరారు. 

దీనిపై ఏజీ స్పందిస్తూ... గత 30 ఏళ్లుగా ఆ భూములు ఆక్రమణలో ఉన్నాయని, ఆక్రమణదారులు నివా సాలు ఏర్పాటు చేసుకున్నారని, ఆ భూముల నుంచి దేవస్థానానికి ఎలాంటి ఆదాయమూ లేదని తెలి పారు.  భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని, తద్వారా వచ్చే సొమ్మును దేవస్థానానికి జమ చేస్తామని వివరించారు. దేవస్థానం కోల్పోతున్న భూమికి ప్రత్యా మ్నా యం మరోచోట భూమిని ఇస్తామన్నారు. సింహాచలం దేవస్థానం ఈవో తరఫు న్యాయవాది కె.మాధవరెడ్డి వాదనలు వినిపిస్తూ... ఆక్రమణదారులను భూముల నుంచి ఖాళీ చేయించే పరిస్థితి లేదన్నారు. ప్రభు త్వ నిర్ణయంతో దేవస్థానానికి ఆదాయం వస్తుందని చెప్పారు. భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభు త్వం తీసుకొచ్చిన పథకాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు. 

ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. క్రమబద్ధీకరణ పేరుతో దేవస్థానానికి చెందిన విలువైన భూము లను వేరేవారికి కట్టబెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రత్యామ్నాయంగా తక్కువ విలువ ఉన్న భూములను దేవస్థానానికి అప్పగించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, దేవ స్థానం.. ఇరుపక్షాలు కమ్మక్కు అయ్యారా? అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. వాజ్యం పై తుదివిచారణ జరుపుతామంటూ విచారణను వాయిదా వేసింది.