ఆరోగ్య‌శ్రీలో బ్లాక్ ఫంగస్‌ చికిత్స.. జగన్ స‌ర్కారు కీలక నిర్ణయం

బ్లాక్ ఫంగ‌స్‌. ఈ పేరే ఇప్పుడు క‌రోనాతో కోలుకున్న వారిని హ‌డ‌లెత్తిస్తోంది. క‌రోనా కంటే వేగంగా ప్రాణాల‌ను బ‌లిగొంటోంది. ఏపీలోనూ బ్లాక్ ఫంగ‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో.. బ్లాక్ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్టు సీఎం జ‌గ‌న్‌ ప్రకటించారు. ఆ మేర‌కు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు సీఎం జ‌గ‌న్‌. 

బ్లాక్ ఫంగ‌స్‌. మ‌హా డేంజ‌ర‌స్‌. కొవిడ్‌ బాధితులనే ఇది అటాక్ చేస్తోంది. ఐసీయూలో ఉండడం, మెడిక‌ల్‌ ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్ సోకుతోంది. మొద‌ట‌ శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. తర్వాత గుంటూరులో 4, తూర్పుగోదావరి 3, ప్రకాశం 1, కర్నూలులో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖ, పశ్చిమగోదావరిలోనూ బ్లాక్ ఫంగ‌స్‌కేసులు క‌నిపించాయి. 

బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు..
కళ్లు, ముక్కు ఎరుపెక్కడంతో పాటు తీవ్రంగా నొప్పి చేస్తాయి. జ్వరం, తలనొప్పి, జలుబు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు రక్తపు వాంతులు, మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఇలాంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. బ్లాక్‌ ఫంగ్‌సపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తోంది. ఫంగస్‌కు సంబంధించి ఎలాంటి కొత్త విషయాలు బయటపడినా రాష్ట్రాలకు సమాచారం ఇస్తోంది. ఫంగస్‌ సోకిన వారికి ఎలాంటి అనారోగ్య లక్షణాలుంటాయో తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ ఒక పోస్టర్‌ విడుదల చేసింది. 

ఏపీలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరుగుతుండ‌టం క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. కర్నూలులో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతి చెందారు. వారిలో ఒకరు అనంతపురం, మరొకరు కడపకు చెందిన వారుగా తెలుస్తోంది.  మరోవైపు ఆరోగ్యశాఖ ఇప్పటి వరకూ దీనిపై దృష్టిసారించ లేదు. బ్లాక్‌ఫంగ్‌సపై ఇప్పటి వరకూ స్పష్టమైన ఆధారాలు లభ్యం కాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఏపీ నుంచి ఆరోగ్యశాఖ ప్రతినిధులు హాజరవుతున్నా, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

గుంటూరు జిల్లాలో నాలుగు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూశాయి. ఈ నలుగురూ గత నెలలో కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారే. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.   విశాఖ నగరంలోని మధురవాడ సమీప వాంబేకాలనీ మల్లయ్యపాలెంకు చెందిన మహిళ(35)కు దవడ భాగంలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించాయి. ఆరిలోవలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి అత్యవసర విభాగంలో ఆ మహిళ చే రారు.

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి రాజమండ్రి, వైజాగ్‌ ఆస్పత్రుల్లో చూపించగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ తీయించారని, కన్ను, ముక్కు, మెదడుకు ఫంగస్‌ వ్యాపిస్తోందని వైద్యులు చెప్పినట్లు బాధితుడి భార్య తెలిపారు. అలాగే, పెదపాడు మండలం కలపర్రు గ్రామస్థుడికి బ్లాక్‌ ఫంగ్‌సగా అనుమానిస్తూ అవసరమైన ఇంజక్షన్లు, వైద్యానికి రిఫర్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినట్టు జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి రమేశ్‌కిశోర్‌ తెలిపారు. 

తాజాగా, ఏపీ ప్ర‌భుత్వం బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చ‌డం కాస్త ఊర‌ట నిచ్చే అంశం.