బియ్యం స్మగ్లింగ్ జరిగిందా? కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తోందా? 

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కుల్లో పడ్డారా? ఆయన చుట్టు ఉచ్చు బిగిస్తొందా? అంటే రాష్ట్ర బీజేపీ నేతల దూకుడు చూస్తుంటే పరిస్థితి అలానే కనిపిస్తోంది. కేటీఆర్ టార్గెట్ గా భారీ స్కాం బయటపెట్టేందుకు కమలం నేతలు స్కెచ్ వేశారని తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్ని వరి సాగు చుట్టూనే జరుగుతున్నాయి. తెలంగాణలో పండిన వరి పంటను మొత్తం కేంద్రమే కొనాలంటూ టీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. ఏకంగా సీఎం కేసీఆరే ధర్నా చేశారు. మోడీ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ లో గులాబీ ఎంపీలు రచ్చ చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ తమను టార్గెట్ చేయడానికి సాధనంగా ఉపయోగించుకుంటున్న వరి విషయంలోనే కేటీఆర్ కు ఉచ్చు బిగించేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. 

వరి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణలో భారీగా అక్రమాలు జరిగాయని కొంత కాలంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్లు మిల్లర్లతో కుమ్మక్కై వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెబుతున్నారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇదే విషయం చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇచ్చిన టార్గెట్ ప్రకారం బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే ఇవ్వలేదని, ఇచ్చినదంతా తీసుకుంటామని గోయెల్ స్పష్టం చేశారు. తెలంగాణలోని బియ్యం నిల్వలను తనిఖీ చేసేందుకు కేంద్ర బృందాలను పంపితే.. నిల్వల విషయంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయని గుర్తించాయని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలు కర్ణాటక నుంచి తక్కువ మొత్తానికి బియ్యం కొనుక్కొచ్చి ఎక్కువ మొత్తానికి రైతుల రూపంలో ఎఫ్‌సీఐకి అమ్ముతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. అర్వింద్ ఆరోపణలకు దగ్గరగానే కేంద్రమంత్రి గోయెల్ ప్రకటన ఉండటంతో.. టీఆర్ఎస్ టార్గెట్ గా కేంద్రం పావులు కదుపుతోందని అర్దమవుతోంది.

పార్లమెంట్‌లో  గోయల్ఇచ్చిన సమాధానంతో టీఆర్ఎస్ లో కలవరం రేగిందని చెబుతున్నారు. అందుకే  ఎంపీలంతా హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దీనిపై కేసీఆర్ వారికి ఏం చేయాలో దిశానిర్దేశం చేసి పంపించారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మరో సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్‌ తనయుడి కేటీఆర్ కనుసన్నల్లో బియ్యం స్మగ్లింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, బియ్యం స్మగ్లింగ్‌పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  తక్కువ ధాన్యం కొనుగోలు చేసి రిజిస్టర్లలో ఎక్కువ సేకరించినట్టు నమోదు చేసేవారని..బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఎక్కువ చూపించినదంతా కర్ణాటక నుంచి ఇతర ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ నేతలు స్మగ్లింగ్ చేసి తీసుకు వచ్చి ఎఫ్‌సీఐకి అమ్మి కోట్లు గడించారని ఆరోపిస్తున్నారు. ఇది వ్యవస్థీకృతంగా జరిగిందని.. దీనిపై విచారణ చేయాలని అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. 

సోమవారం లోక్‌సభలో మాట్లాడిన అర్వింద్.. రాష్ట్రంలో ఇతర పంటలను నిర్లక్ష్యం చేయడం వెనుక పెద్ద స్మగ్లింగ్‌ ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్‌ కోసం రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం సరఫరా చేస్తుందని.. పాతకాలపు, ఆధునిక రైస్‌ మిల్లులకు క్వింటా ధాన్యాన్ని రూ.1,600 చొప్పున విక్రయిస్తున్నాయని అర్వింద్ తెలిపారు. ఆధునిక రైస్‌ మిల్లులు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి కిలో బియ్యాన్ని రూ.40 చొప్పున దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయని చెప్పారు.  పాత రైస్‌ మిల్లు లు రీసైకిల్‌ చేసిన బియ్యాన్ని పొరుగు రాష్ట్రాల నుంచి కిలో రూ.18 చొప్పున కొనుగోలు చేసి, 100 కిలోల ధాన్యానికి 67 కిలోల రీసైకిల్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందిస్తున్నాయని తెలిపారు. ఇలా కిలోకు రూ.18 చొప్పున 67 కిలోలకు ఈ మిల్లర్లు రూ.1,206 వెచ్చించి క్వింటా ధాన్యంపై  400 రూపాయలు ఆర్జిస్తున్నారని అర్వింద్ లోక్ సభలో తెలిపారు. ఈ వేల కోట్ల కుంభకోణం కేసీఆర్‌ కుమారుడి కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపించారు. 

వరి కొనుగోళ్లలో పక్కాగా అక్రమాలు జరిగాయని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు విచారణ చేయించడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇటీవలి కాలంలో కేసుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ బట్టి చూస్తే త్వరలో తెలంగాణలో బియ్యం కొనుగోళ్ల స్కాం బట్టబయలయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.