బీజేపీ, జేడీఎస్ మధ్య  మళ్ళీ పొత్తు?

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు..శాశ్వత శతృవులు ఉండరు. ఇది వందల వేలసార్లు రుజువైన వాస్తవం. ముఖ్యంగా జాతీయ, ప్రాంతీయ పార్టీల శతృమిత్ర సంబంధాల విషయంలో అయితే, ఇది తరచూ సాగే క్రతువుగానే జరుగుతూ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో తెలుగు దేశం, బీజేపీ మధ్య ఎన్ని సార్లు పొత్తు పొడిచిందో అన్ని సార్లు ... తెగతెంపులు కూడా  జరిగాయి.. రెండు పార్టీలు మళ్ళీ మరోసారి కలుస్తాయా అంటే ..ఏమో..రాజకీయాలలో  ప్రేమలో ఏదైనా జరగ వచ్చును.  

అయితే  ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ బంధంలానే, కర్ణాటకలో  బీజేపీ, జేడీ (ఎస్)  బంధం కూడా పునరపి జననం, పునరపి మరణం అన్న రీతిలోనే సాగుతోంది. ఇప్పుడు, అక్కడ, రెండు పార్టీల మధ్య మరో మారు బంధం ఏర్పడుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.కర్ణాటక అసెంబ్లీక  2018లో ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపధ్యంలో,జేడీఎస్ నేత కుమార స్వామి ముఖ్యమంత్రిగా, జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే, జులై 2019లో కాంగ్రెస్ ఎమ్యెల్యేలు పెద్ద ఎత్తున బీజేపీలోకి ఫిరాయించడంతో జేడీఎస్ ప్రభుత్వం పడిపోయింది. ఇక అప్పటి  నుంచి  కర్ణాటకలో బిజెపి – జేడీఎస్ ల మధ్య రాజకీయ వైరుధ్యం పతాక స్థాయికి చేరుకొంది. నిజానికి ముందు బీజీపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూడా అంతర్గత కలహాల కారణంగానే అర్థాంతరంగా కూలిపోయింది. 

అయితే, ఇప్పుడు రెండు పార్టీలు గతం గతః’ అని గతాన్ని పక్కన పెట్టి 2023లో జరిగే శాసన సభ ఎన్నికల నాటికి, ఒకటయ్యే దారిలో అడుగులు వేస్తున్నాయి. నవంబరు 30న పార్లమెంటరీ భవన్‌లో జరిగిన  “సహృద్భావ సమావేశం”కు ప్రధాని నరేంద్ర మోదీ, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ చేతిలో చెయ్యేసి తీసుకు నడిచిన ఫోటోలు కొత్త పొత్తుకు తొలి సంకేతంగా భావిస్తున్నారు. 
అదలా ఉంటే డిసెంబర్ 10న ఒకే సారి 25 శాసన మండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికలను  రెండు పార్టీల సమోధ్యకు అవకాశంగా మలచుకున్నాయి. ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం అంటూ వచ్చిన జేడీఎస్ అధికార బిజెపితో  అవగాహనకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తున్నది. దేవెగౌడ- మోదీ  సమావేశం ముగిసిన వెంటనే, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ , దేవెగౌడ కుమారుడు హెచ్‌డి కుమారస్వామి,  బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప మండలి ఎన్నికల ఉమ్మడి వ్యూహం సిద్ధం చేస్తున్నారని ప్రకటించారు. అంతకు ముందు, నవంబర్ 4న, జేడీఎస్ భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేకంగా 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి-జేడీఎస్ పొత్తు అవసరమని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.

మొత్తం 75 మంది సభ్యులున్న పెద్దల  సభలో బిజెపికి 32 స్థానాలు, కాంగ్రెస్‌కు 29,  జెడిఎస్ 12 స్థానాలు ఉన్నాయి. వీరుగాక ఒక స్వతంత్ర సభ్యుడు, జేడీఎస్ కు చెందిన మండలి చైర్మన్ ఉన్నారు. కాగా, ప్రస్తుతం ఎన్నికలు  జరుగతున్న 25 స్థానల్లో 15 కాంగ్రెస్ సిట్టింగ్ స్థనాలు .కాగా, 6 బీజేపీ,  4 జెడిఎస్ సిట్టింగ్ స్థానాలు. ఎన్నికలు జరుగుతున్న 25 సీట్లలో జేడీఎస్ ఆరుచోట్ల మాత్రమే పోటీ చేస్తుండడంతో బిజెపి - జేడీఎస్ అనధికారికంగా పొత్తు  పెట్టుకున్నాయి. నిజానికి, బీజేపీ, జేడీఎస్ మధ్య గత కొంతకాలంగా సంబందాలు మెరుగవుతున్నాయి.గత ఫిబ్రవరిలో, కాంగ్రెస్‌కు చెందిన మండలి చైర్మన్ కె. ప్రతాపచంద్ర శెట్టిని తొలగించే విషయంలో బిజెపి,  జెడిఎస్ కలసి వ్యూహాత్మకంగా పనిచేశాయి. ఆ స్థానంలో జెడిఎస్ అభ్యర్థి బసవరాజ్ హొరట్టి ఎన్నిక కాగా, బిజెపికి చెందిన ఎంకె ప్రాణేష్‌ను డిప్యూటీ చైర్మన్‌గా  ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి  పదవి చేపట్టిన కొద్దీ రోజులకు బొమ్మై దేవెగౌడ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బొమ్మై రాజకీయ నేపధ్యం మాజీ జనతా పరివార్ కావడంతో జేడీఎస్ బిజెపికి దగ్గరవుతున్నాయనే ఊహాగానాలు రాజకీయ వర్గాలలో చెలరేగుతున్నాయి. 

గత డిసెంబర్ లో జేడీఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నట్లు వెలువడిన కథనాలను కొట్టిపారవేస్తూ,  అంశాల ఆధారంగా తమ రెండు పార్టీలు కలసి పనిచేసే అవకాశం ఉన్నట్లు ఎడ్డియూరప్ప, కుమారస్వామి ప్రకటించారు. 2018లో తాను కాంగ్రెస్ తో కాకుండా బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన్నట్లయితే తాను ఇప్పుడు మెరుగైన రాజకీయ పరిస్థితులలో ఉండేవాడినని ఈ మధ్య ఒకసారి కుమారస్వామి పేర్కొన్నారు. జేడీఎస్ కు కీలక మద్దతు దక్షిణ కర్ణాటకలో ఉండడం, బిజేపికి ఉత్తర కర్ణాటకలో ఉండడం రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో రాజకీయంగా విరుద్ధ ప్రయోజనాలు ఏర్పడే అవకాశం లేదు. అయితే దక్షిణ కర్ణాటకలో జేడీఎస్ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ సవాల్ చేస్తూ ఉండడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయంగా అశనిపాతంగా మారింది. తమ పార్టీకి గల కీలక మద్దతును కాపాడుకోవడం కోసం విశేషంగా ప్రయత్నిస్తున్న కుమారస్వామి అందుకు కాంగ్రెస్ కన్నా బిజెపి అండ మేలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే, కుమార స్వామితోనూ కమలదళానికి చెడు అనుభవాలున్నాయి. సో .. చివరకు ఏమవుతుంది అనే విషయంలో  మండలి ఎన్నికల తర్వాత మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు.