ప్రాంతీయ పార్టీల పాలిట అనకొండ బీజేపీ!?

ఎన్డీయే ఖాళీ అవ్వడం వెనుక బీజేపీ వ్యూహం ఉందా? ఉద్దేశ పూర్వకంగానే మిత్రపక్షాలను కూటమి వీడేలా బీజేపీ వ్యవహరిస్తోందా? 2024 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగడమే రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది.

ఆ పార్టీ చెబుతున్న డబుల్ ఇంజిన్ అర్ధం ఇదేనా? దేశ  వ్యాప్తంగా అన్నిరాష్ట్రాలలోనూ అధికారం చేజిక్కించుకోవాలంటే ముందుగా ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయాలన్నదే ఆ పార్టీ లక్ష్యమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వారి వ్యూహానికి బీహార్ లోని జేడీయూ అధినేత బ్రేక్ వేశారా? బీహార్ లో బీజేపీ వ్యూహం బెడిసికొట్టిందా? అంటే కూడా ఔననే అంటున్నారు. ఎన్డీయే కూటమి నుంచి ఒక్కటొక్కటిగా పార్టీలు వైదొలగడానికి కారణం బీజేపీ వ్యవహరిస్తున్న తీరే కారణమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

అవసరార్ధం ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం.. ఆ తరువాత అనకొండలా వాటిని మింగేయడానికి ప్రయత్నించడం.. కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర వరకూ బీజేపీ అనుసరించిన వైఖరి ఇదేనని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్ని ప్రాంతీయ పార్టీలూ పొత్తు విచ్ఛిన్నమయ్యే సమయానికి తమ స్వరాష్ట్రంలో బలహీనపడిన ఉదంతాలే ఉన్నాయని అంటున్నారు. బీహార్ పరిణామం తరువాత బీజేపీతో మైత్రి చెడిన పార్టీల నుంచి ఇంకా పొత్తులో కొనసాగుతున్న పార్టీల వరకూ అన్ని నితీష్ వ్యూహాలను ప్రశంసిస్తున్నారు. ఆయన కీలెరిగి బీజేపీకి వాత పెట్టారని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉండడానికి కారణం.. ఆయా రాష్ట్రాలలో అవసరార్దం పొత్తులు కుదుర్చుకుని.. వాటి అండతో రాష్ట్రంలో బలపడి.. ఆ తరువాత వాటినే టార్గెట్ చేయడం బీజేపీ గత ఎనిమిదేళ్లుగా అనుసరిస్తున్న వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అలా ఇప్పుడు నితీష్‌ టార్గెట్ చేసిందనేది కూడా ఓ  ఆరోపణ. నిజానికి వరుస పరిణామాలకు ఈ మాటలకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయ్. ఇప్పుడు బిహార్ మాత్రమే కాదు.. ఈ మధ్యే ముగిసిన మహారాష్ట్ర పంచాయితీతో పాటు.. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌తో దోస్తీకి కూడా బ్రేక్ పడింది. బీహార్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రానికి చెందిన   లోక్‌ జనశక్తి పార్టీ.. ఎన్డీఏలో ఒకప్పుడు భాగంగా ఉండేది.   రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత ఎల్‌జేపీ పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ పావుగా వాడుకొందన్న విమర్శలున్నాయి. బీహార్ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులున్న చోట బలమైన క్యాండిడేట్లను నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చింది ఎల్‌జేపీ.  ఎన్నికలయ్యాక చిరాగ్‌ను పట్టించుకోవడం మానేసింది బీజేపీ నాయకత్వం. అదే సమయంలో ఎల్‌జేపీలో చెలరేగిన తిరుగుబాటు సమయంలో … చిరాగ్‌ పాశ్వాన్‌ స్థానంలో ఆయన బాబాయి పశుపతి కుమార్‌ పరాస్‌కు బీజేపీ మద్దతుగా నిలబడింది. ప్రస్తుతం ఎల్ జెపీ   పూర్తిగా పశుపతి హ్యాండోవర్‌లో ఉంది. పాశ్వాన్ వారసుడిగా చక్రం తిప్పుదామనుకున్న చిరాగ్‌.. బీహార్ పాలిటిక్స్‌లో కంప్లీట్‌గా సైడ్ అయిపోయారు.

ఇక మహరాష్ట్ర సంగతి తలిసిందే.  ఒకప్పుడు శివసేన మద్దతుతో మహారాష్ట్రలో నిలబడ్డ బీజేపీ.. ఇప్పుడు ఆ పార్టీనే మింగేసిందనే చెప్పాలి. సీఎం పదవి విషయంలో వచ్చిన పేచీతో ఎన్నో ఏళ్లుగా కలిసి వస్తున్న శివసేనకు రాం రాం చెప్పేసింది బీజేపీ. అటు కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్లు పూర్తికాకముందే.. శివసేనలో రేగిన అసమ్మతిని తమకు పూర్తి అనుకూలంగా మార్చుకున్న కమలం పార్టీ వ్యూహాలతో ఉద్ధవ్ థాక్రే మల్లగుల్లాలు పడుతున్నారు.  కనీసం పార్టీ చిహ్నం అయినా తమకు దక్కుతుందా? దక్కదా అన్న అయోమయంలో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. పేరుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ షిండే అయినా పగ్గాలు మొత్తం బీజేపీవే అన్నట్లుగా ఇప్పుడు మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగుతోంది.  ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితి.  శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ చట్టాల విషయంలో విభేదించి ఎన్డీయేకు గుడ్ బై చెప్పింది. అటు అమరీందర్ సింగ్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పేదాకా వెంటపడింది. చివరకు బీజేపీ ఉచ్చులో చిక్కుకుని అమరీందర్ సొంత కుంపటి పెట్టగానే ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పొత్తు పంజాబ్ ఎన్నికలలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయినా.. కాంగ్రెస్ ను అధికారం నుంచి దూరం చేయడానికి మాత్రం దోహదపడింది. అంతే కాకుండా కాంగ్రెస్ నేతగా, పంజాబ్ సీఎంగా తిరుగులేని నేతగా ఉన్న అమరీందర్ ను ఇప్పుడు రాష్ట్రంలో నామమాత్రపు నేతగా మార్చేసింది.    దేశవ్యాప్తంగా అధికారంలో ఉండాన్న పట్టుదలతో బీజేపీ   మిత్రుడు, శత్రువు అని తేడా లేకుండా వ్యూహాలు రచిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

అక్రమంలోనే మిత్ర పక్షాలను బలహీనం చేసి, లేదా మింగేసి ఆయా రాష్ట్రాలలో బలోపేతం అయ్యేందుకు ఎత్తులు వేస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్‌ ఇన్‌ లవ్‌ అండ్ వార్ అన్న నానుడికి బీజేపీ.. పాలిటిక్స్ కూడా చేర్చేసిందని అంటున్నారు.