మోడీ షా ద్వయానికి బీహార్ పరిణామాల షాక్.. సెక్యులర్ శక్తుల పునరేకీకరణకు నాంది!

బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్పకూలి మహాఘట్ బంధన్ ప్రభుత్వం కొలువు దీరింది. ఇందుకు సంబంధించిన పరిణామాలు వాయువేగంతో జరిగాయి. రాజకీయంగా దేశంలో అత్యంత శక్తిమంతులు అని అంతా భావించే మోడీ షా ద్వయం చేష్టలుడిగి నిలబడిపోయేలా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి వేగంగా పావులు కదిపారు.

ఒక్క రోజులోనే ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం.. బీహార్ లో కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, మహాఘట్ బంధన్ తో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. బీహార్ లో ఈ పరిణామాలు చోటు చేసుకోవడానికి మాత్రం పూర్తి కారణం మాత్రం మోడీ, షా ద్వయం వ్యవహార శైలే. బీజేపీ ఆధిపత్య ధోరణే అని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే మిత్రధర్మాన్ని ఉల్లంఘించి కనీసం జేడీయూ అధినేత అయిన నితీష్ కుమార్ తో సంప్రదించకుండానే ఆర్పీసింగ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అది రుచించని నితీష్ ఆర్పీసింగ్ కు మరో సారి రాజ్యసభ కు పంపించేందుకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అనివార్యంగా ఆర్పీసింగ్ కేంద్ర మంత్రి పదవి కోల్పోయారు. అలాగే సంకీర్ణ ధర్మాన్ని ధిక్కరించి అడుగడుగునా పాలనలో జోక్యం చేసుకోవడంతో నితీష్ ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.

ఆర్పీసింగ్ ను అడ్డం పెట్టుకుని బీహార్ లో మహారాష్ట్ర ప్లాన్ అమలు చేయాలన్న బీజేపీ వ్యూహాలను పసిగట్టిన నితీష్ కుమార్ ప్రతి వ్యూహాలను అమలు చేశారు. అందులో భాగంగానే ఆర్పీసీంగ్ కు రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించ లేదు. అనివార్యంగా ఆయన కేంద్ర మంత్రి పదవిని వదులుకునేలా చేశారు. అంతే కాకుండా ఆర్పీసింగ్ కుమార్తె అవినీతిపై ప్రశ్నించడంతో   ఆర్పీసింగ్ జేడీయూకి రాజీనామా చేసే పరిస్థితి కల్పించారు. అక్కడితో జేడీయూకి ఎన్డీయేతో బంధం తెగిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. చివరికి అదే జరిగింది.

దాదాపు  నెల రోజులుగా  నితీష్ బీజేపీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు.  ప్రధాని అధ్యక్షతన   జరిగిన నీతిఆయోగ్‌ సమావేశానికి,   అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జులై 17న అమిత్‌షా నిర్వహించిన సమావేశానికి, రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి, గత నెల 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి కూడా నితీశ్‌ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన మహాఘట్ బంధన్ లో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ శిష్యుడిగా అవినీతి వ్యతిరేక పోరులో పాల్గొని రాజకీయంగా ఎదిగిన నితీష్ ఏ కూటమిలో ఉన్నా తన సెక్యులర్ భావాలను మాత్రం వీడలేదని ఆయన అభిమానులు చెబుతుంటారు.

సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన కూటమిలోని పార్టీల అవినీతిని, సెక్యులర్ వ్యతిరేక భావనలను నిలదీస్తనే ఉన్నారు. ప్రశ్నిస్తూనే ఉన్నారని చెబుతుంటారు.   తాజాగా బీహార్ పరిణామాలు జాతీయ స్థాయిలో సెక్యులర్ శక్తుల పునరేకీకరణకు మార్గం సుగమం చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు బలం చేకూర్చే విధంగానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా చేసిన ప్రసంగంలో మోడీ పాలనకు 2024లో శుభం కార్డు పడుతుందని నితీష్ చేసిన పకటన ఉంది. అలాగే మాజీ ప్రధాని దేవెగౌడ కూడా బీహార్ పరిణామాలు సెక్యులర్ శక్తుల పునరేకీకరణకు మార్గం సుగమం చేశాయని అభిప్రాయపడ్డారు.