బీహార్ తొలి విడతలో ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్
posted on Nov 7, 2025 11:40AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం (నవంబర్ 6) తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ముందుకు వచ్చి మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నిటికీ మించి తొలి విడతలో గతంలో ఎన్నడూ లేని విధంగా 64.66 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డు స్థాయి అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి.
రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఆ విడతలో మిగిలిప 122 స్థానాలకూ పోలింగ్ జరుగుతుంది. సరే ఇక తొలి విడతలో పోలింగ్ విషయానికి వస్తే.. మహిళలు అత్యధికంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటింగ్ శాతం పెరగడం అధికార కూటమికా, లేక ఇండియా కూటమిగా ఎవరికి ప్లస్ కానుందన్న చర్చ అప్పుడే మొదలైంది. అలాగే.. జనసురాజ్ పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. బీహార్ అసెంబ్లీకి 1951-52లో జరిగిన మొదటి ఎన్నికల్లో అత్యల్పంగా 42.6 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2000 సంవత్సరంలో 62.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2020లో 57.29 శాతం నమోదైంది. అయితా తాజాగా తొలి విడతలోనే 64.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే రాజకీయ పరిశీలకుల విశ్లేషణలకు పదును పెట్టింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంపై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి.
ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం భారీగా పెరగడం జనం రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతమని అంటున్నారు. అయితే భారీగా పోలింగ్ నమోదు కావడంపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మార్పు కోసమే మహిళలు తరలివచ్చారని చెబుతున్నారు. కాదు కాదు.. అధికార కూటమి పనితీరుకు ప్రజలు పాజిటివ్ గా స్పందించడమే ఓటింగ్ శాతం పెరగడానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఏ కూటమికి కలిసి వచ్చిందన్నది తేలాలంటే ఫలితాలు వెలువడే నవంబర్ 14 వరకూ ఎదురు చూడాల్సిందే.