మోడీ పర్యటనకు ముందు తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్!

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా  జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకునేందుకు సర్వం సన్నద్ధమైన బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకోవడానికి రెండు రోజుల ముందు బీజేపీ నుంచి వలసలు ఆ పార్టీ రాష్ట్ర నాయకలకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మునిసిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ తో కలిసి గులాబి గూటికి చేరారు.  హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాశ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాశ్ గౌడ్ లతో పాటు తాండూరు మునిసినల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజా గౌడ్ లు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తాండూరు కౌన్సిలర్ ఆసిఫ్ కూడా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. వీరందరికీ మంత్రి  కేటీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇటీవలే జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమై ముచ్చటించిన సంగతి తెలిసిందే. అలాంటిది మోడీ మరో రోజులో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద‌రాబాద్ కూడా రానుండగా వీరంతా బీజేపీకి గుడ్ బై చెప్పి కారెక్కడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకులకు మాత్రం ఇదొక తేరుకోలేని ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.