గవర్నర్ వ‌ర్సెస్‌ సీఎం.. వేరువేరుగా రిప‌బ్లిక్ డే వేడుకలు.. ఎందుకలా?

దేశమంతా 73వ గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంది. ప్రజలు ప్రముఖులు స్వాతంత్ర సమర యోధులకు, రాజ్యాంగ నిర్మాతలకు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ గణతంత్ర వేడుకలు జరిగాయి.కానీ, ఏదో వెలితి కొట్టొచ్చినట్లు కనిపించింది. 

నిజమే, కొవిడ్ కారణంగా, అంక్షల నడుమ జరిగిన వేడుకల్లో కొంత జోష్ తగ్గింది. అది దేశం అంతటా ఉన్నదే, అయినా పొరుగు రాష్త్రం ఆంధ్ర ప్రదేశ్’ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి  జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసు దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరిగింది. అలాగే, ఇతర రాష్ట్రాలలోనూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే, రాజ్యాంగ స్పూర్తి గౌరవించే విధంగా,గణతంత్ర దినోత్సవ గౌరవానికి భంగం కలగని విధంగా వేడుకలను నిర్వహించారు. నిజానికి ఏపీలో కంటే తెలంగాణలో కోవిడ్ కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణ‌ అధికారులు, నైట్ కర్ఫ్యూ కూడా అవసరం లేదని అంటున్నారు.  

కానీ, తెలంగాణలో రాజ్ భవన్’లో జరిగిన ప్రధాన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించలేదు. మంత్రులు ఎవరూ హాజరు కాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, కొద్ది మంది ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొన్నారు. జిల్లాలలో కూడా కలెక్టర్ కార్యాలయాలలో ఏదో మొగ్గుబడి తంతుగా గణతంత్ర వేడుకలు నిర్వహించారే కానీ, జాతీయ స్పూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు జరగలేదని అధికార వర్గాలో చర్చ జరుగుతోంది. 

నిజమే ముఖ్యమంత్రి రాజ్ భవన్’ లో జరిగిన ప్రధాన కార్యక్రమానికి రాలేదు కానీ, ప్రగతి భవన్’లో త్రివర్ణ పతాకం ఎగరేశారు. జెండా వందనం చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, జాతిపిత మహత్మా గాంధీ చిత్ర పటాలకు దండం పెట్టారు. అక్కడి నుంచి  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో యుద్దవీరులకు నివాళులర్పించారు.  అయితే, ఇలా అలగ్- సలగ్ అన్నట్లుగా గవర్నర్, ముఖ్యమంత్రి వేరు వేరుగా గణతంత్ర వేడుకలలో పాల్గొనడం చర్చ నీయాంసంగా మారింది. 

అదలా ఉంటే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం రాజ్ భవన్’లో గవర్నర్ ఇచే తేనెటీ విందు కార్యక్రమం, ‘ఎట్ హోమ్’ కూడా ఈ సంవత్సరం జరగడం లేదు. రద్దయింది. అయితే ఎందుకు రద్దయింది అనే విషయంలో స్పష్టత లేక పోయినా, సందేహాలు మాత్రం వినవస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయి అనే ఉద్దేశంతోనే ‘ఎట్ హోమ్’ రద్దయిందని అంటున్నారు. 

ఇదలా ఉంటే, గత సంవత్సరం అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగానూ ముఖ్యమంత్రి  జాతిపితకు నివాళులు అర్పించలేదని గుర్తు చేస్తున్నారు. అలాగే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం పై రాజకీయ యుద్దాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి, తెరాస ప్రభుత్వం గణతంత్ర వేడుకలను కూడా, కేంద్ర ప్రభుత్వంఫై వ్యతిరేకతను చూపేందుకు వేదిక చేసుకున్నారా అనే మాట కూడా వినిస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీ గణతంత్ర వేడుకలలో ప్రదర్శించిన శకటాలలో తెలంగాణ శకటం ఎంపిక కాకపోవడం విషయంగా కేటీఆర్ సహా అనేక మంత్రి మంత్రులు, తెరాస నాయకులు కేంద్ర ప్రభుత్వంఫై మండిపడిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెరాస మంత్రులు తెలంగాణ  భారత  దేశంలో భాగం కాదా, అని ప్రశ్నించడం ద్వారా సెంటిమెంట్ రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారని, దానికి కొనసాగింపుగానే ఇప్పుడు, ఇలా అసంతృప్తిని వ్యక్త పరిచారని అంటున్నారు.  

అదే విధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలోనూ, సమాఖ్య స్పూర్తి గురించి, రాష్ట్రాల హక్కుల గురించి ప్రస్తావించారు.  భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని.. దేశాన్ని తయారు చేసేది రాష్ట్రాలేనని సీఎం కేసీఆర్ తెలిపారు.  ఈ ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి  కేంద్ర ప్రభుత్వంపై  మరోమారు యుద్దనాదం చేశారని అంటున్నారు. కేంద్రంతో లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ముఖ్యమంత్రి యుద్ధం ప్రకటించ వచ్చును, కానీ, గణతంత్ర వేడుకలను వేదిక చేసుకోవడం, రాజ్యాంగ స్పూర్తిని అగౌరవ పరిచేలా ప్రవర్తించడం మాత్రం సరికాదని అంటున్నారు. అయితే, అధికారులు, అధికార పార్టీ నాయకులు మాత్రం,  రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిరహించక పోవడానికి, ముఖ్యమంత్రి దూరంగా ఉండడానికి కొవిడ్ మహామ్మారే కారణం అంటున్నారు. అయితే మనకంటే ఎక్కువ కేసులు నమోదవుతున్న ఇతర రాష్ట్రాలకు  లేని ఆంక్షలు, తెలంగాణకు ఎందుకని, అడుగుతున్నారు, నిజానికి, తెలంగాణలో కోవిడ్ ఎక్కడుందని అధికారులే అడుగుతున్నారు. నైట్ కర్ఫ్యూ కూడా నాట్ నెసిసరి, అవసరం లేదని, రాష్ట్ర  ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రకటించారు. సో, గానతంత్ర దినోత్సవంలో అపశ్రుతులు, అవమానాలకు కోవిడ్ కాదు రాజకీయమే కారణం అంటున్నారు.