Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భోపాల్ గ్యాస్ ట్రాజెడీ.. క్విడ్ ప్రో క్వో ఆరోపణల చుట్టూ తిరిగే కలుషిత రాజకీయ గాధ.!
posted on: Aug 2, 2026 7:25AM

భారత స్వతంత్ర చరిత్రలో అత్యంత భయానక పారిశ్రామిక విపత్తు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ 1984). అయితే, ఈ విపత్తు కేవలం ఒక రసాయన ప్రమాదం మాత్రమే కాదు. ప్రభుత్వ బాధ్యత, అంతర్జాతీయ కార్పొరేట్ శక్తి, న్యాయ వ్యవస్థ పరిమితులు, రాజకీయ ప్రభావం మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని బహిర్గతం చేసిన ఒక గాధ. ఈ నేపథ్యంలో.. రాజీవ్ గాంధీ ప్రభుత్వం, యూనియన్ కార్బైడ్ , వారెన్ ఆండర్సన్ , అదిల్ షహ్ర్యార్, క్విడ్ ప్రో కో ఆరోపణల చుట్టూ తిరిగే వివాదాన్ని, చారిత్రక ఆధారాలు, న్యాయపరమైన రికార్డులు.
చారిత్రక నేపథ్యం.. విషవాయువు లీకైన రాత్రి, వేలాది ప్రాణాలు, దేశం నైతిక పరీక్ష
1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారంలో నుండి సుమారు 40 టన్నుల మెథైల్ ఐసోసయనేట్ (Methyl Isocyanate, MIC) అనే విషపూరిత వాయువు లీక్ అయింది. ఈ వాయువు, కర్మాగారం చుట్టూ ఉన్న బస్తీ ప్రాంతాలపై దట్టంగా వ్యాపించి, వేలాది మంది నిద్రలోనే ఊపిరాడక, కళ్లకు చూపు పోయి, ఊపిరితిత్తులు కాలిపోతున్నట్లుగా బాధపడుతూ మరణించారు.
భా ప్రభుత్వ అధికారిక అంచనాల ప్రకారం మరణాలు 3వేల 800 కాగా, స్వతంత్ర అధ్యయనాలు మరణాల సంఖ్య 8 వేల నుంచి16 వేల వరకు ఉంటుందనీ, అలాగే విషవాయు ప్రభావిత మరణాలు పాతిక వేల వరకూ ఉంటాయనీ అంచనా వేశాయి. 5 లక్షల మందికి పైగా ప్రజలు విషవాయువు ప్రభావానికి గురయ్యారు. వారిలో అనేక మంది దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, జన్యు సంబంధిత ఆరోగ్య సమస్యలు, తరతరాలుగా కొనసాగుతున్న వైద్య, సామాజిక బాధలను ఎదుర్కొంటున్నారు.
ఈ విపత్తు, దేశంలో పారిశ్రామిక భద్రత, కార్పొరేట్ బాధ్యత, ప్రభుత్వ నైతిక బాధ్యతకు పరీక్షగా నిలిచింది. అదే సమయంలో, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సంబంధాలు, అమెరికన్ కార్పొరేట్ శక్తి ప్రభావం, ఈ కేసు న్యాయపరమైన మార్గాన్ని ఎలా ప్రభావితం చేశాయో కూడా స్పష్టమవుతుంది.
సంఘటనల కాలక్రమం.. గ్యాస్ లీక్ నుండి సుప్రీంకోర్టు సెటిల్‌మెంట్ వరకు
1984 డిసెంబర్ 3: విషవాయువు లీక్ అనంతరం, భోపాల్ నగరం ఒక్క రాత్రిలోనే సాక్రిఫైస్ జోన్ గా మారింది. వేలాది మృతదేహాలు, ఆసుపత్రుల్లో కిక్కిరిసిన బాధితులు, భయంతో వణికిపోయిన నగరం ఇవన్నీ ప్రపంచాన్ని కుదిపేశాయి.
1984.. డిసెంబర్ 7.. యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ చైర్మన్ వారెన్ ఆండర్సన్, భారతదేశానికి వచ్చి, భోపాల్‌లో అరెస్టు అయ్యాడు. అయితే, అతనికి బెయిల్ మంజూరు చేసి, తరువాత భారతదేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు. ఆండర్సన్ తిరిగి భారతదేశానికి రాకపోవడంతో, తరువాత భారత న్యాయస్థానాలు అతన్ని అబ్ స్కండర్ గా ప్రకటించాయి.
1985.. భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్ యాక్ట్, 1985 ద్వారా, ఇండియన్ గవర్నమెంట్ పారిన్ పాటరైజ్ అంటే దేశ ప్రజల తరఫున న్యాయపరమైన సంరక్షకుడు పాత్రను స్వీకరించి, బాధితుల తరఫున యూనియన్ కార్బైడ్‌పై కేసులు వేసింది.
1989 ఫిబ్రవరి 14.. సుప్రీంకోర్టు, ఆర్టికల్ 142 ఆధారంగా, యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్, ఇండియన్ గవర్నమెంట్ మధ్య 470 మిలియన్ అంటూ సుమారు 750 కోట్ల విలువైన గ్లోబల్ సెటిల్‌మెంట్ ను ఆమోదించింది. ఈ సెటిల్‌మెంట్, అన్ని సివిల్, క్రిమినల్ కేసులను ముగించేలా, బాధితుల క్లెయిమ్స్, హక్కులు, బాధ్యతలను ఒకే ఒప్పందంలో సమీకరించింది.
ఈ సెటిల్‌మెంట్‌కు ముందు ఇండియన్ గవర్నమెంట్ మొదట్లో సుమారు 4 బిలియన్ డాలర్ల వరకు పరిహారం కోరినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. అయితే, చివరకు 470 మిలియన్ డాలర్ల వద్ద సెటిల్‌మెంట్ జరగడం, పరిహారం పరిమాణం, బాధితుల న్యాయం ప్రభుత్వ చర్చా సామర్థ్యంపై సందేహాలు వెల్లవెత్తాయి.
1991 అక్టోబర్ 3.. సుప్రీంకోర్టు, 1989 సెటిల్‌మెంట్‌పై వచ్చిన రివ్యూ పిటిషన్లను విచారించి, క్రిమినల్ కేసులను క్వాష్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, వారెన్ ఆండర్సన్, ఇతరులపై క్రిమినల్ కేసులను పునరుద్ధరించింది. అయితే, 470 మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌ను కొనసాగించింది.
2023: డౌ కెమికల్.. యూనియన్ కార్బైడ్‌ను కొనుగోలు చేసిన సంస్థ పై అదనపు 7 వేల 844 కోట్లు పరిహారం కోరుతూ భారత ప్రభుత్వం వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో.. భోపాల్ గ్యాస్ బాధితుల అదనపు పరిహారం ఆశలు మూసుకుపోయాయి.
ఆబ్సల్యూట్ లైబిలిటీ, సెటిల్‌మెంట్, జస్టిస్ హర్రీబ్ జస్టిస్ డినైడ్
భోపాల్ కేసు, భారత న్యాయ చరిత్రలో “ఆబ్సల్యూట్ లైబిలిటీ సూత్రాన్ని బలంగా అమలు చేసిన కీలక కేసు.ఎమ్ సీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (Oleum Gas Leak Case.. 1987)లో అభివృద్ధి చెందిన ఈ సూత్రం ప్రకారం, ప్రమాదకర పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే ఏ సంస్థైనా, ప్రమాదం జరిగితే, ఎలాంటి మినహాయింపులు లేకుండా బాధితులకు పూర్తి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది.
అయితే, ఈ సిద్ధాంతాన్ని న్యాయపరంగా అంగీకరించినప్పటికీ, 1989 సెటిల్‌మెంట్‌లో నిర్ణయించిన 470 మిలియన్ డాలర్ల పరిహారం, బాధితుల సంఖ్య, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు, పర్యావరణ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుంటే, “grossly inadequate”గా అనేక న్యాయ, సామాజిక విశ్లేషణలు పేర్కొన్నాయి.
నవ్ జోబన్ సింగ్ మాన్ వంటి న్యాయ విశ్లేషకులు, ఈ సెటిల్‌మెంట్‌ను “justice hurried is justice denied” అనే సిద్ధాంతంతో విమర్శిస్తూ, సుప్రీంకోర్టు తక్షణ పరిహారం, కేసు ముగింపు, , అంతర్జాతీయ ఒత్తిడిని సమతుల్యం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దీర్ఘకాలిక వైద్య, పర్యావరణ బాధ్యతలను సమగ్రంగా అంచనా వేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఇంకా ఒక కీలక న్యాయపరమైన అంశం, భోపాల్ బాధితుల క్లెయిములను ను సాధారణ మోటార్ వాహన ప్రమాదాల పరిహారం ప్రమాణాలతో పోల్చడం. ఇది రసాయన విషపూరితత వల్ల కలిగే అంతర్గత, జన్యు,తరతరాల ఆరోగ్య ప్రభావాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వచ్చాయి.
అదిల్ షహ్ర్యార్, వారెన్ ఆండర్సన్, మరియు “క్విడ్ ప్రో క్వో” ఆరోపణలు
అదిల్ షహ్ర్యార్.. ప్రముఖ భారత దౌత్యవేత్త మహమ్మద్ యూనస్ కుమారుడు యూనస్, నెహ్రూ, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, సుభాస్ చంద్ర బోస్ సంబంధిత ఫైళ్ల చుట్టూ ఉన్న చర్చల్లో కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. అదిల్, సంజయ్ గాంధీ వర్గానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందాడు. అదిల్ షహ్ర్యార్, అమెరికాలో తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి, 1982లో అమెరికా కోర్టులో కో 35 సంవత్సరాల జైలు శిక్షకు గురయ్యాడు.
1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధాని అయిన తరువాత, భారత ప్రభుత్వం అదిల్ విడుదల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు వివిధ రచనలు సూచిస్తున్నాయి. 1985లో,అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, అదిల్ షహ్ర్యార్‌కు క్షమాభిక్ష మంజూరు చేసి అతని జైలు శిక్షను ముగించాడు. ఈ క్షమాభిక్ష రాజీవ్ గాంధీ జూన్ 1985 అమెరికా పర్యటన సమయంలో రావడం, రాజకీయ వర్గాల్లో క్విడ్ ప్రో కో ఆరోపణలకు దారితీసింది.
కొంతమంది రాజకీయ వ్యాఖ్యాతలు, వారెన్ ఆండర్సన్ భారతదేశం నుండి సులభంగా వెళ్లిపోవడం, అదిల్ షహ్ర్యార్ అమెరికా జైలు నుండి విడుదల కావడం మధ్య క్విడ్ ప్రోకో ఉందని ఆరోపించారు. అంటే, ఒకటి మరొకటి ఇచ్చిన రాజకీయ దౌత్య సౌకర్యం.
2015లో.. లలిత్ మోదీ వివాదంపై పార్లమెంటులో జరిగిన చర్చలో, సుష్మా స్వరాజ్.. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, వారెన్ ఆండర్సన్, అదిల్ షహ్ర్యార్ క్షమాభిక్ష అంశాలను ప్రస్తావించి.. క్విడ్ ప్రోకో అనే పదాన్ని వాడారు.
అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ప్రత్యక్ష, న్యాయపరంగా నిర్ధారించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇప్పటివరకు బయటకు రాలేదు. అందువల్ల, క్విడ్ ప్రోకో అంశం రాజకీయ, మీడియా చర్చల్లో బలంగా వినిపించినప్పటికీ, న్యాయపరంగా కాకపోవడంతో బలమైన రాజకీయ ఆరోపణ స్థాయిలోనే నిలిచింది.
జేఆర్డీ టాటా లేఖ, హెన్రీ కిసింజర్ సందేశం, సెటిల్‌మెంట్ పరిమాణంపై ప్రశ్న
1988 మే 31 తేదీతో, జేఆర్డీ టాటా, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి రాసిన ఒక రహస్య లేఖలో, అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్ సందేశాన్ని తెలియజేశాడు. ఆ సందేశం ప్రకారం.. యూనియన్ కార్బైడ్ సంస్థ.. భారత కోర్టుల భారత కోర్టులు తమ తీర్పులలో పేర్కొన్న పరిహారానికి మించి, అధిక మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉందని, అయితే అది ఔట్ ఆఫ్ కోర్టు రూపంలో, ఆ సెటిల్‌మెంట్‌ను భారత రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా విమర్శించకపోతేనే సాధ్యమని పేర్కొన్నట్లు లేఖలో ఉంది.
ఈ లేఖ, ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతుంది.. యూనియన్ కార్బైడ్, ఔటాఫ్ కోర్టు ద్వారా ఎక్కువ పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉంటే, చివరకు 470 మిలియన్ డాలర్ల వద్ద సెటిల్‌మెంట్ ఎందుకు జరిగింది? ఇక్కడ.. అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడి, అమెరికన్ కార్పొరేట్ దౌత్య ప్రభావం, భారత ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక, న్యాయ పరిమితులు, అన్నీ కలిసి పనిచేసినట్లు పరిశీలకులు విశ్లేషించారు. బాధితుల దృష్టిలో, ఈ సెటిల్‌మెంట్, “ అడర్ వాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ లైవ్స్ గా, ఇండస్ట్రియల్ ఇంపునిటి(industrial impunity) కి ఒక ఉదాహరణగా కనిపించింది.
రాజకీయ, సామాజిక, మీడియా కోణాలు.. బాధితుల న్యాయం, ప్రభుత్వ బాధ్యత
భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, భారత ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అద్దం. ఒక వైపు, లక్షలాది బాధితులు, తరతరాలుగా ఆరోగ్య–ఆర్థిక బాధలను మోస్తూ, “న్యాయం” కోసం పోరాడుతున్నారు. మరో వైపు, యూనియన్ కార్బైడ్, డౌ కెమికల్, మరియు వారెన్ ఆండర్సన్ వంటి అంతర్జాతీయ కార్పొరేట్–వ్యక్తిగత శక్తులు, న్యాయపరమైన బాధ్యత నుండి పెద్దగా తప్పించుకున్నట్లు కనిపిస్తున్నాయి. రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై వచ్చిన ప్రధాన విమర్శ, భోపాల్ బాధితుల క్లెయిములను తగిన స్థాయిలో ప్రతినిధ్యం చేయడంలో, మరియు యూనియన్ కార్బైడ్‌పై కఠినమైన న్యాయపరమైన–ఆర్థిక ఒత్తిడి తీసుకురావడంలో, ప్రభుత్వం విఫలమైందనే అంశం. 470 మిలియన్ డాలర్లకు పరిహారం తగ్గడం, సెటిల్‌మెంట్ ద్వారా క్రిమినల్ బాధ్యతను తాత్కాలికంగా క్వాష్ చేయడం, ప్రభుత్వ జవాబుదారీ తనంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. మీడియా, సామాజిక ఉద్యమాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు.. భోపాల్‌ను వరల్డ్స్ వరస్ట్ ఇండస్ట్రియల్ డిసాస్టర్ విత్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ పనిష్ మెంట్ గా పేర్కొంటూ, కార్పొరేట్, ప్రభుత్వ సంబంధాలపై తీవ్రమైన విమర్శలు చేశారు.
భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, భారతదేశంలో పారిశ్రామిక భద్రత, పర్యావరణ న్యాయం, కార్పొరేట్ బాధ్యతపై దీర్ఘకాలిక చర్చకు నాంది పలికింది. ఆబ్సల్యూట్ లైబిలిటీ సిద్ధాంతం, పారెన్స పాటరైస్ పాత్ర, మాస్ టొర్ట్ లిటిగేషన్ వంటి న్యాయపరమైన అంశాలు, ఈ కేసు ద్వారా భారత న్యాయ వ్యవస్థలో బలంగా స్థిరపడ్డాయి. అయితే, బాధితుల దృష్టిలో, ఈ కేసు న్యాయం ఆలస్యమై, తక్కువగా అసంపూర్ణంగా వచ్చిన ఒక ఉదాహరణ. 2010లో యూనియన్ కార్బైడ్ మాజీ అధికారులకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల జరిమానా వంటి తక్కువ శిక్షలు, వారెన్ ఆండర్సన్ జీవితాంతం న్యాయపరమైన విచారణకు గురికాకపోవడం, industrial impunity భావనను మరింత బలపరిచాయి.
భోపాల్ గాథ, భారత రాజకీయ చరిత్రలో గాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ సంప్రదాయంపై కూడా ప్రశ్నను లేవనెత్తుతుంది సామాన్య ప్రజల ప్రాణాలు, అంతర్జాతీయ కార్పొరేట్ దౌత్య సంబంధాల కంటే తక్కువ విలువైనవా? అన్నదే ఆ ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం, కేవలం భోపాల్ బాధితులకే కాదు, భవిష్యత్తులో భారతదేశంలో జరిగే ఏ పారిశ్రామిక, పర్యావరణ విపత్తుకైనా, ఒక నైతిక, న్యాయ ప్రమాణంగా నిలవాలి.
భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, ప్రపంచంలోనే అత్యంత భయానక పారిశ్రామిక విపత్తు; అయితే, దీనికి వచ్చిన న్యాయపరమైన శిక్ష, అతి తక్కువ. పరిహారం 3 బిలియన్ డాలర్ల నుంచి 470 మిలియన్ డాలర్లకు తగ్గడం, సెటిల్‌మెంట్ ద్వారా క్రిమినల్ బాధ్యతను తాత్కాలికంగా క్వాష్ చేయడం, రాజీవ్ గాంధీ ప్రభుత్వ బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది. అదిల్ షహ్ర్యార్ క్లమాభిక్ష, వారెన్ ఆండర్సన్ భారతదేశం నుండి సులభంగా వెళ్లిపోవడం, క్విడ్ ప్రోకో ఆరోపణలు, నెహ్రూ–గాంధీ కుటుంబం చుట్టూ ఉన్న రాజకీయ దౌత్య సంబంధాలపై ఒక కలుషిత నీడను వేసాయి. though not legally proven, politically potent.
జేఆర్డీ టాటా.. హెన్రీ కిసింజర్ లేఖ, యూనియన్ కార్బైడ్ ఎక్కువ పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందని సూచించినప్పటికీ, చివరకు 470 మిలియన్ డాలర్లకు సెటిల్ మెంట్ జరగడం “Indian lives under-valued” అనే విమర్శకు బలాన్ని ఇచ్చింది. భోపాల్ బాధితులు, ఇప్పటికీ పర్యావరణ కాలుష్యం, జన్యు ఆరోగ్య సమస్యలు, మరియు ఆర్థిక కష్టాలతో పోరాడుతూ, “restorative justice” కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నారు.
~ పరిశోధన, సంకలనం సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
Bhopal Gas Tragedy, Rajiv Gandhi, Warren Anderson, Adil Shahryar, Union Carbide, Quid Pro Quo






