ఇంటింటి భోగి "మంటలు"!!

రంగురంగుల ముంగిళ్ళ పండుగ, ముగ్గుల పోటీల పండుగ సంక్రాంతి. సూర్యుడు మఖరరాశిలో ప్రవేశించడంతో ప్రారంభమయ్యే వెలుగుల ప్రతాపానికి మొదలు ఇదే అవుతుంది. భోగి, సంక్రాంతి, కనుమగా ముచ్చటగా మూడు రోజులు అలరించే ఈ పండుగ కళ ప్రతి ఏడాది అంతకంతకూ తగ్గుతోందనే చెప్పాలి. ఉద్యోగాలు, చదువుల నిమిత్తం దూరం వెళ్లిపోయిన కొందరు మాత్రమే స్వగ్రామాలకు తిరిగి వెళ్లి పండుగ సంబరాలలో భాగస్వాములవుతారు. అయితే నేటి కాలంలో కారణాలు ఎన్ని ఉన్నా మనుషుల మధ్య సఖ్యత తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఒకప్పటి ఆప్యాయత, బాధ్యత ఇప్పట్లో ఏ కుటుంబంలో మెండుగా ఉండటం లేదు. దానికి కారణాలు తెలుసుకుని వాటన్నిటినీ సంక్రాంతి భోగిమంటలలో వేసి కుటుంబాలలో ఉన్న మనస్పర్థలు, దూరాలు చెరిపేసుకోండి.

ప్రాధాన్యత!!

ప్రస్తుతం ఇంట్లో వైఫై, మొబైల్, లాప్టాప్, టీవీ, ఇంకా ఎన్నెన్నో వస్తువులు వీటికున్న ప్రాధాన్యత మనుషులకు అసలు ఇవ్వడం లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంటికి నెట్ పెట్టిస్తే నెల నెలా దానికి క్రమం తప్పకుండా బిల్ పే చేయాలనే బాధ్యత ఉంటుంది కానీ కనీసం రోజులో ఒకసారి అయిదు నిమిషాలు లేదూ తీరిక లేకుంటే వారానికి కనీసం ఓ గంటసేపు కుటుంబ సభ్యులు అందరూ ఒకదగ్గర కూర్చుని మనసువిప్పి మాట్లాడుకునే సంఘటనలు ఇప్పటి తరం ఎంతమాత్రం కనబడుతున్నాయో ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. అందుకే డబ్బు, బంధాలు రెండింటినీ తూకం వేయకూడదు. 

సమస్యలు పరిష్కారాలు!!

సమస్య ఏదైనా తప్పక పరిష్కారం ఉంటుంది. కుటుంబంలో ఆర్థిక, బంధాల మధ్య సమస్యలు రావడం సహజం. ఆయితే వాటిని కుటుంబ వ్యక్తులే పరిష్కారం చేసుకోవాలి కానీ గోరంత సమస్యను బెట్టు చేసి, మొండి పట్టులో కొండంత సమస్యగా పెంచకూడదు. 

తరాల మధ్య తేడా గమనించాలి!!

"మేము మీలగా ఉండేవాళ్ళం కాదు మీ వయసులో ఉన్నపుడు" ఇది తరచుగా చాలా ఇళ్లలో పెద్దలు అనే మాట. అయితే గమనించాల్సిన విషయం కాలం కూడా అలాగే లేదు. నిన్న మొక్క ఈరోజు వృక్షం అయినట్టు నిన్నటి వాళ్ళు ఈరోజు బాధ్యతలతో ఉంటారు. మొక్క నిన్న కేవలం ఎదుగుదలలో ఉంటుంది, పెద్దయ్యాక పండ్లు, పూలు ఇస్తుంది. అలాగే మనుషులూనూ. అందులోనూ వేగవంతమైన కాలంలో స్థిరంగా ఏదీ ఉండదు. మార్పులకు తగ్గట్టు మనిషి ఆలోచనలు కూడా మారతాయి. అదే విషయాన్ని పెద్దలు గుర్తించాలి. తరాల మధ్య తేడాను ఆ తేడాకు సర్దుకుపోవడాన్ని అర్థం చేసుకోవాలి. 

దాంపత్యాలు దృఢమవ్వాలి!!

ప్రపంచంలో భార్యాభర్తలకు మించిన గొప్ప స్నేహితులు ఉండరు. అలాగే ఆ ఇద్దరూ ఎడమోహం, పెడమోహంగా ఉంటే వాళ్లకు మించిన శత్రువులు వేరే ఎక్కడా కనిపించరు. వచ్చిన చిక్కల్లా ఆ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వస్తే జడ్జిమెంట్ పేరుతో మూడో మనిషి చేతిలో సమస్యను పెట్టి ఎవరిది తప్పు చెప్పమని అడగడం. ఇక్కడి నుండి సమస్యలు మొదలవుతాయి. నిజానికి ఒకరికి ఒకరు అనుకునే గొప్ప బంధంలో తప్పులు ఉండవు పొరపాట్లు ఉంటాయి. జరిగేవాటిని పొరపట్లుగా చూసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే విడాకులు అనే పదం వినిపించడం ఆగిపోవచ్చు కూడా.

స్వేచ్ఛకు సంకెళ్లు వేయద్దు!!

పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరికీ ఆలోచన ఉంటుంది. పున్నాగపూలు అనే నవలలో ప్రముఖరచయిత్రి జలందర గారు చెబుతారు "పిల్లలకు ఆదుకోవడం నేర్పిస్తాము, మాట్లాడటం నేర్పిస్తాము, తినడం నేర్పిస్తాము, నడవడం నేర్పిస్తాము కానీ ఆలోచించడం నేర్పించము ఎందుకు??" అని. పెద్దరికాన్ని చూపించాలనో, పెత్తనం చెలాయించాలనో, లేక అతి ప్రేమ వల్లనో తల్లిదండ్రులు పిల్లలని ఒక కీ ఇచ్చే బొమ్మలా తయారుచేస్తారు. అందుకే చాలామందికి చదవడం, తినడం, మార్కులు తెచ్చుకోవడమే కర్తవ్యం అనే అజ్ఞానం పేరుకుపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్లే ఒకవయసు వచ్చాక స్వేచ్ఛ రుచి తెలిసాక గొడవలు పడి దూరం వెళ్లిపోవడం లేదా తల్లిదండ్రులను ద్వేషించడం చేస్తారు. అందుకే పిల్లలకు చిన్నతనం నుండే వాళ్ళకూ ఓ ఆప్షన్ ఇచ్చేయ్యాలి. ఆ తరువత దాని ముందు వెనుకలు వివరించి చెప్పాలి తుది నిర్ణయం వారికే వదిలేయాలి.

పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా ప్రతి కుటుంబంలో అర్థం చేసుకోలేకపోవడం, ఆర్థిక సమస్యలు, బయటి వ్యక్తుల జోక్యం వల్ల ఎదురయ్యే సమస్యలు, అనారోగ్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ చిటపటలన్నీ పెద్దగవ్వకుండా భోగిమంటల సాక్షిగా మెల్లిగా మాట్లాడుకుని వాటన్నింటినీ నిప్పుల్లో గుమ్మరించేయండి. హాయిగా కలసిమెలసి ఉండండి.

◆ వెంకటేష్ పువ్వాడ