భారతీ సిమెంట్‌కు షాక్
posted on Oct 12, 2025 1:02PM

ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ కార్పొరేషన్ కు ఇచ్చిన రెండు సున్నపు గని లీజులను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దం అవుతోంది.కేంద్ర గనుల నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో భారతి సిమెంట్స్‌కు మంజూరైన రెండు సున్నపురాయి లీజులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
కేంద్ర గనులశాఖ అభ్యంతరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి, అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఈ లీజులు చట్టవిరుద్ధంగా మంజూరైనట్టు గుర్తించింది. రాష్ట్ర గనులశాఖ తుది నివేదిక సమర్పించిన వెంటనే, భారతి సిమెంట్స్‌కు ఇచ్చిన రెండు లీజుల రద్దు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2015లో కేంద్రం సవరించిన గనుల చట్టం ప్రకారం, సున్నపురాయి వంటి ప్రధాన ఖనిజాల లీజులు వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి. అలాగే, 2015 జనవరి 12కు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయినా, 2017 జనవరి 11లోపు అన్ని అనుమతులు పొందకపోతే ఆ లెటర్ స్వయంగా రద్దు అవుతుందని నిబంధనల్లో స్పష్టం చేశారు.
కానీ, ఈ నిబంధనలను పక్కనబెట్టి 2024 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నాటి సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ (తన సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న సంస్థ)కు రెండు లీజులను మంజూరు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీజులు కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లోని 509.18 ఎకరాలు మరియు 235.56 ఎకరాల భూములపై ఇవ్వబడ్డాయి. వాస్తవానికి ఈ భూములు రఘురాం సిమెంట్స్‌కు చెందినవిగా ఉండగా, 2009లో భారతి సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.