గవర్నర్ వర్సెస్ మమతా! ముదురుతున్న వివాదం  

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల క్రతువు పూర్తయినా, ఎన్నిక రాజేసిన వేడి మాత్రం ఇంకా చల్లార లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో హింస రాజుకుంది. రాజకీయ హత్యలు, దొమ్మీలు, దోపిడీలు యధేచ్చగా సాగాయి. అలాగే, ఈ నెల 5 తేదీన, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనే రాష్ట్ర గవర్నర్ జగదీప్ దినకర్, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ హింసను అణచి వేస్తారన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్త పరిచారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా, హింసకు పాల్పడేవారిని, ఉపేక్షించేది లేదని,ఉక్కుపాదంతో అణచివేస్తామని హామీ ఇచ్చారు. 

ఆ తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. మరోవంక దాడులు, దొమ్మీలు, అరాచక కార్యకలాపాలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా, కూచ్ బెహర్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనలతో అగ్నికి ఆజ్యం తోడైంది. రాష్ట్ర గవర్నర్ దినకర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య వివాదాన్ని సృష్టించింది.కూచ్ బెహర్ ఘటనల నేపధ్యంలో, హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాలను స్వయంగా సందర్శించేందుకు గవర్నర్ ధన్‌కర్ సిద్దమయ్యారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏర్పాట్లు చేయలేదు. ఈ నేపధ్యంలో  తన పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన పర్యటనకు సంబంధించి ప్రభుత్వ అధికారుల నుంచి కనీస సమాచారం లేదని.. ఏర్పాట్ల గురించి కనీసం పట్టించుకోలేదని గవర్నర్ ధన్‌కర్ పేర్కొన్నారు. అలాంటి పర్యటనలేవీ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలను ఆయన తప్పుబట్టారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలో లేని పరిస్థితులు ఒక్క బెంగాల్లోనే ఎందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.దీంతో బెంగాల్‘లో రాజకీయం మరింతగా వేడెక్కింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం భగ్గుమంటోంది. 

అయితే, ఇది కేవలం రాజకీయ వివాదంగానే మిగిలి పోతుందా,రాజకీయ సంక్షోభానికి దారి తీస్తుందా అన్న సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్త మవుతున్నాయి.గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య ముందునుంచి అయోధయ్త అంతగా లేని నేఅప్ధ్యంలో రాజకీయ వివాదం రాజ్యాంగ వివాదంగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య రాజుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి, కేంద్రం జోక్యంచేసుకుంటే, అది దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతుందని రాజకీయ పరిశీలకు అభిప్రాయ పడుతున్నారు.జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు ఉబలాట పడుతున్న మమత బెనర్జీ అదే కోరుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.అయితే,ఓ వంక దేశం కొవిడ్ మహమ్మారితో పోరాడుతున్న  సమయంలో రాజకీయ వివాదాలకు తావీయడం మంచింది  కాదని, పరిశీలకులు, మేధావులు హెచ్చరిస్తున్నారు.