బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. తగాదా తీర్చెదెలా.. అధిష్ఠానం మల్లగుల్లాలు!
posted on Jan 6, 2025 11:39AM

తెలంగాణలో బీజేపీ పయనం బావిలో కప్ప మాదిరిగా తయారైంది. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతోంది. అధికారమే తరువాయి అన్నట్లుగా ఒక సమయంలో బలంగా కనిపించిన ఆ పార్టీ ఆ తరువాత బలహీనపడింది. దక్షిణాదిన బలోపేతం కావడానికి ఆశాదీపంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ భావిస్తోంది. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా.. రాష్ట్రానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం క్యూ కట్టి మరీ రాష్ట్రానికి వచ్చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కూడా ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనాయకత్వం అంతా తెలంగాణలో పార్టీ కోసం గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఆ పార్టీ ఆ రెండు ఎన్నికలలోనూ చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించినా, రాష్ట్రంలో అధికారం అన్న కల మాత్రం నెరవేరలేదు. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోనైనా అత్యధిక స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నది. అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో పెచ్చరిల్లిన విభేదాల కారణంగా ఆ ఆశ నిరాశ కాకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో అంతర్గత విబేధాలకు ప్రధాన కారణం.. అగ్రనాయకత్వం ముందు వెనుకలు ఆలోచించకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని వచ్చినట్లుగా చేర్చుకుని కీలక పదవులు అప్పగించడమే కారణమని అంటున్నారు. ఆ కారణంగానే పార్టీలో కొత్త, పాత నేతల మధ్య పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. దీంతో కింకర్తవ్యం అని పార్టీ అధిష్ఠానం తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఉంది. పార్టీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కూడా ముందువెనుకలాడాల్సిన పరిస్థితి నెలకొంది. పాతవారిని సముదాయించలేక, కొత్త వారిని నియంత్రించలేక నానా ఇబ్బందులూ పడుతోంది.
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ, రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టం అనీ, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ బీజేపీ హైకమాండ్ ఎప్పుడో అంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెంటనే ప్రకటించింది. అయినా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అందుకు కారణంగా పార్టీలోని అంతర్గత విభేదాలే అనడానికి ఇసుమంతైనా సంకోచించాల్సిన అవసరం లేదు.
గత రెండు నెలల కిందటి వరకూ పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి రేసులో ముగ్గురు నుంచి నలుగురు ఉన్నప్పటికీ అనేక వడపోతల తరువాత రేసులో ప్రధానంగా ఈటల రాజేందర్ నిలిచారు. అయితే పార్టీలోనూ, పార్టీ క్యాడర్ లోనూ మంచి పట్టు ఉన్న కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడూ బండి సంజయ్ అడ్డుగా నిలుస్తున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటల తప్ప మరెవరైనా అభ్యంతరం లేదని ఆయన పార్టీ హైకమాండ్ వద్ద గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటనుంచి వచ్చి చేరిన వారికి అప్పగించడానికి తాము అంగీకరించబోమని పార్టీలోనిహిందూ హిందుత్వ వాదులతో పాటు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ వంటి సంస్థలూ పట్టుబడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి వరకూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను అనూహ్యంగా బీజేపీ హైకమాండ్ మార్చేసింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. ఆ మార్పు వెనుక ఉన్నది ఈటల రాజేందర్ అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో పార్టీ చేరికల కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఈటల రాజేందర్ కు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ అడుగడుగునా అడ్డు పడ్డారనీ, ఆ కారణంగానే ఈటల పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలకు చేసిన ప్రయత్నాలు ముందుకు సాగలేదనీ ఈటల వర్గీయులు అప్పట్లో ఆరోపణలు గుప్పించారు. అప్పటి నుంచీ ఇరువురి మధ్యా ఉప్పూ నిప్పు అన్న చందంగానే సంబంధాలు ఉన్నాయి.
ఆ కారణంగానే ఈటలకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ హైకమాండ్ ఇప్పుడు ముందువెనుకలాడుతోందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే తెలంగాణ సమాజంలో గుడ్ విల్ ఉండటం, బీసీ నేత కావడంతో ఈటలకు పగ్గాలు అప్పగించడమే మేలని హైకమాండ్ భావిస్తోందనీ, అదే సమయంలో తొలి నుంచీ బీజేపీలో ఉన్న బండి సంజయ్ మాటను తోసి రాజనే ధైర్యం కూడా బీజేపీ హైకమాండ్ చేయడం లేదని అంటున్నారు. బండి సంజయ్, ఈటల మధ్య సయేధ్య కోసం పార్టీ పెద్ద తలకాయలు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కిరావడం లేదనీ, అందుకే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నియామకం విషయంలో నెలల తరబడి జాప్యం జరుగుతోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈటలకు పదవి ఇస్తే బండి ఇన్ యాక్టివ్ అవుతారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులూ కాడె వదిలేస్తారు. పోలీ ఈటలను పక్కన పెడదామంటే ఆయన పార్టీనే వదిలేస్తారు. ఈ రెండూ కూడా ఆయనతో పాటు కార్యకర్తలూ కాడె వదిలేస్తారు. ఈటలను పక్కన పెడతామంటే ఆయన బీజేపీనే వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది.
సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత అయిన ఈటలను వదులు కుంటే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని బీజేపీ హైకమాండ్ భయపడుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టాలన్న ఆ పార్టీ ఆశ నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని ఈటలకు పెద్ద పీట వేస్తే తెలంగాణలో బీజేపీ కుదేలౌతుంది. ఆ పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలో కొనసాగుతున్న బండి వంటి నేతలు పార్టీకి దూరమౌతారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఆ పార్టీ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. దీంతో ఎటూ తేల్చుకోలేక బీజేపీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పును వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఈ సమస్యను రానున్న రోజులలో ఎలా అధిగమిస్తుందో చూడాల్సిందే.