బండి సంజ‌య్ సై.. కేటీఆర్ నై.. సంథింగ్ రాంగ్‌?

అంతా రాజ‌కీయం. ఏదైనా రాజ‌కీయం కోస‌మే. ఏ రాజ‌కీయ నేతైనా ఓ మాట మాట్లాడారంటే.. దాని వెనుక రాజ‌కీయ అవ‌స‌రం ఉండే ఉంటుంది. అది కాద‌న‌లేము. కానీ, అలా రాజ‌కీయం చేయ‌డంలోనే ఉంటుంది తెలివంతా. చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడే వారు.. అతి జాగ్ర‌త్త‌గా అడుగులు వేసేవారు మాత్ర‌మే రాజ‌కీయాల్లో రాణించ‌గ‌ల‌రు. లేదంటే.. ఎండాకాలం వాన‌లా ఇలా వ‌చ్చి అలా క‌నుమ‌రుగ‌వ‌క త‌ప్ప‌దు. ఇక సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉంటున్నా.. గ‌త రెండేళ్ల‌లోనే అనూహ్యంగా ఎదిగారు బండి సంజ‌య్‌. కార్పొరేట‌ర్ స్థాయి నుంచి నేరుగా ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు అయ్యారు. తనకేదో గాలివాటంగా ఈ ప‌ద‌వులు రాలేద‌ని.. అందుకు త‌గ్గ అన్ని అర్హ‌త‌లు త‌న‌కున్నాయ‌ని తొంద‌ర‌లోనే నిరూపించుకున్నారు. దుబ్బాక‌లో గెలిచి, జీహెచ్ఎమ్‌సీలో గెలిచినంత ప‌ని చేసి.. స‌త్తా చాటారు. రాష్ట్రంలో ఏ మూల‌న, ఏ బీజేపీ కార్య‌క‌ర్త‌పై ఏ చిన్న‌ దెబ్బ ప‌డినా.. అక్క‌డ వాలిపోతున్నారు. మీకు నేనున్నానంటూ ధైర్యం నూరిపోస్తున్నారు. ఇప్పుడు ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌వుతున్నారు. 

ఇక టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. తండ్రి వార‌స‌త్వంతో వేగంగా తారాస్థాయికి చేరారు. రాజ‌కీయంగా కేసీఆర్ అంత‌టోడిగా మారిన హ‌రీశ్‌రావును సైడ్ చేసేసి.. సైడ్‌వేస్‌లో అంద‌లం ఎక్కేశారు. ప‌రిపాల‌న చూసుకోవ‌డం.. కేసీఆర్ చెప్పిన‌ట్టు చేయ‌డమేగానీ.. కేటీఆర్ సొంతంగా పాలిటిక్స్ చేయ‌డం త‌క్కువే. కేటీఆర్ రాజ‌కీయ సామర్థ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌ను ఉద్దేశించి.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న‌ స్లీపింగ్ ప్రెసిడెంట్ అంటూ సెటైర్లు వేశారు.  

ఇలా రెండు పార్టీల్లో కీల‌క నేత‌లుగా ఉన్న బండి సంజ‌య్‌, కేటీఆర్‌ల‌కు.. రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ శీల‌ ప‌రీక్ష పెట్టిందంటున్నారు. మంత్రి కేటీఆర్ త‌న రాజ‌కీయ అజ్ఞానంతో బ్ల‌డ్ శాంపిల్స్ ఇస్తానంటూ రేవంత్‌రెడ్డి చేతికి అద్భుత‌మైన అవ‌కాశాన్ని అందించారు. డైన‌మిక్ లీడ‌ర్ రేవంత్‌రెడ్డి అందివ‌చ్చిన అవ‌కాశాన్ని అత్య‌ద్భుతంగా అందుకున్నారు. ఇటు కేటీఆర్‌ను, అటు బండి సంజ‌య్‌ను ఇద్ద‌రినీ ఇర‌కాటంలో ప‌డేయాల‌ని స్కెచ్ వేసి వైట్ ఛాలెంజ్ విసిరారు. అయితే, రేవంత్ విసిరిన ట్రాప్‌లో కేటీఆర్ నిలువునా చిక్కుకోగా.. బండి సంజ‌య్ అనూహ్యంగా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు.

రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరితే కేటీఆర్ స్వీక‌రిస్తారా? అస్స‌లు స్వీక‌రించ‌రు. ఈ విష‌యం అందరికీ తెలుసు. ఆఖ‌రికి రేవంత్‌కు కూడా తెలుసు. అయినా, కావాల‌నే అలా ఛాలెంజ్ చేశారు. అనుకున్న‌ట్టుగానే కేటీఆర్ ఆ ఛాలెంజ్‌కు స్పందించ‌లేదు. వెంట‌నే.. కేటీఆర్‌లానే బండి సంజ‌య్‌ను సైతం ట్రాప్ చేద్దామ‌నుకున్నారు. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డితో బండి సంజ‌య్‌కు స‌వాల్ విసిరిపించారు. ఇక్క‌డే  బండి సంజ‌య్ త‌న రాజ‌కీయ చాతుర్యం ప్ర‌ద‌ర్శించారు. త‌న పాద‌యాత్ర‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే త‌న‌కు వైట్ ఛాలెంజ్ విసిరార‌ని మండిప‌డ్డారు. డ్ర‌గ్స్‌ను, కాంగ్రెస్‌ను తిట్టిపోశారు. దుష్ట కాంగ్రెస్‌ను వీడి, ప్ర‌స్తుతం ఏ పార్టీలో లేని.. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిపై గౌర‌వంతో తానీ వైట్ ఛాలెంజ్ స్వీక‌రిస్తున్నానంటూ రాజ‌కీయ చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించారు బండి సంజ‌య్‌. 

బండి సంజ‌య్ సైతం కాంగ్రెస్ లీడ‌ర్‌ ఛాలెంజ్ చేస్తే.. తిర‌ష్క‌రించేవారేమో. కానీ, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ప్ర‌స్తుతానికి న్యూట్ర‌ల్‌గా ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌న విసిరిన‌ వైట్ ఛాలెంజ్‌ను స్వీక‌రించడం బండికి రాజకీయంగా బాగా క‌లిసొచ్చింది. ఇక‌, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఛాలెంజ్ విస‌ర‌డంతో ఆయ‌న ఆ స‌వాల్‌ను స్పీక‌రించ‌లేద‌ని అనుకోవ‌చ్చు. ఇలా, ఎవ‌రి రాజ‌కీయ ఉద్దేశ్యాలు ఎలా ఉన్నా.. చూసేవారికి మాత్రం కేటీఆర్ దోషిగానే క‌నిపిస్తున్నారు. ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌ బండి సంజ‌యే ఛాలెంజ్ స్వీక‌రించ‌గా.. ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న కేటీఆర్ నిరాక‌రిస్తున్నారంటే..? ఏదో ఉందంటూ గుస‌గుస‌లు వ్యాపిస్తున్నాయి. లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. 

మ‌రోవైపు, రేవంత్‌రెడ్డిపై ప‌రువున‌ష్టం దావా వేస్తూ.. డ్ర‌గ్స్ విష‌యంలో త‌న పేరును ఎవ‌రూ ప్ర‌స్తావించ వ‌ద్దంటూ, మీడియాలో డ్ర‌గ్స్ మేట‌ర్‌లో త‌న గురించి వార్త‌లు రావొద్దంటూ.. కేటీఆర్ కోర్టును ఆశ్ర‌యించ‌డం చూస్తుంటే.. సంథింగ్ రాంగ్.. అనే డౌట్ వ‌స్తోంది.. అంటున్నారు.