అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురుదెబ్బ.. జన్మతహ: పౌరసత్వ హక్కు రద్దుపై కోర్టు స్టే
posted on Jan 24, 2025 9:16AM
.webp)
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసీ చేయడంతోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వెనుకలు ఆలోచించకుండా.. సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా.. నా మాటే వేదం, నా ఆజ్ణే శిలాశాసనం అన్నట్లుగా ఏకపక్షంగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసేశారు.
అలా తీసుకున్న నిర్ణయాలలో అమెరికాలో జన్మతహ వచ్చే పౌరసత్వ హక్కు రద్దు ఒకటి. ఈ నిర్ణయాన్ని అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లను విచారించిన అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు జన్మతహ వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై స్టే విధించింది. కీఈ సందర్భంగా న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలపై స్టే విధించారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 78 ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు ఒకటి. ఇది తొందరపాటు నిర్ణయమన్న విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ నిర్ణయాన్ని వాషింగ్టన్, ఇల్లినాయిస్, ఓరెగాస్, అరిజోనా రాష్ట్రాలు సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధలనకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని పేర్కొన్నాయి. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్.. జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలపై స్టే ఇచ్చారు.