చంద్ర బాబు దార్శ‌నిక‌త‌కు .. కోటాను కోట్ల చక్షువులు

దూర‌దృష్టితో ఆలోచించేవారిని వినాలి, ప‌ట్టించుకోవాలి, గౌరవించుకోవాలి. ఎందుకంటే వారి కార్యాచరణ తక్షణ   లబ్ధి కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం పరిమితం కాదు. భవిష్యత్ వెలుగుల కోసం, భావి తరాల బాగు  కోసం కూడా. వారి ప్రణాళికలు కేవలం తమ పార్టీ అధికారంలో ఉండాలనో లేదా ఈ రోజు అందరి మెప్పూ పొందితే చాలనో కాదు.. తరతరాలు సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలనీ, భవిష్యత్ తరాలు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అనుభవించాలని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దార్శనికత సరిగ్గా ఆ కోవలోకి వస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఏర్పాటు చేసిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కానీ, తెలుగు విద్యార్థుల చదువులకు గట్టి పునాది కోసం తీసుకు వచ్చిన విద్యా సంస్కరణలు కానీ అప్పడే కాదు, ఇప్పుడూ తెలుగు పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేశాయి. వేస్తూనే ఉన్నాయి. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన నిర్మించ తలపెట్టిన అమరావతి గురించి విపక్షం అప్పట్లో ఎన్నో ఎన్నెన్నో విమర్శలు గుప్పించి ఉండవచ్చు. కానీ అమరావతి నిర్మాణ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోనే గొప్ప రాజధానులలో ఒకటిగా నిలిపేంత అద్భుత ప్రణాళిక అని అప్పట్లోనే మేథావులు వేనోళ్ల ప్రశంసించారు.

ప్రధాని మోడీ సైతం అమరావతి శంకుస్థాపనకు వచ్చి అదే ఆకాంక్షించారు. అధికారంలో వుండ‌గా గొప్ప వ్యూహ‌ర‌చ‌న‌తో ఎంద‌రో మేధావుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి మ‌రీ రాజ‌ధాని రూపురేఖ‌లు ఎలా ఉండాలో నిర్ణయించారు చంద్రబాబునాయుడు.  అంత‌ర్జాతీయంగా పేరున్న నార్మ‌న్ పోస్ట‌ర్ సంస్థ‌తో రాజధాని అమరావతిని డిజైన్ చేయించారు.  ఆ సంస్థ డిజైన్ ను గ్రాఫిక్స్‌లో అంద‌రికీ అర్ధ‌మయ్యే లా ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌జా ప్ర‌తినిధులంద‌రికీ అమరావతి ఎంత గొప్పగా ఆవిష్కృతం కానుందో తెలియాలన్న ఆకాంక్ష ఆయ‌న‌ది. కానీ కొందరి తెలివి త‌క్కువ‌త‌నం, మూర్ఖ‌త్వం   అలాంటి ఆలోచ‌న‌ల్ని ముందుకు సాగ‌నీయ‌లేదు. స‌రిగ్గా వైసీపీ  వ‌ల్ల జ‌రిగింది ఇదే.  గ్రాఫిక్ ల‌ని, గిమ్మిక్కుల‌ని, ప్ర‌జ‌ల‌కు సినిమా చూపించి మోసం చేస్తున్నార‌ని నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడారు.

అమ‌రావ‌తి అసెంబ్లీ నిర్మాణాన్ని ఇడ్లీ పాత్ర‌తో పోల్చి వైసీపీ త‌మ అజ్ణానాన్నీ, బుద్ధిహీన‌త‌ను నిస్సిగ్గుగా బయట పెట్టుకుంది.2019 ఎన్నికలలో ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన  జ‌గ‌న్ ఆంధ్రుల ఖ్యాతిని మహోన్నత స్థాయికి తీసుకువెళ్లే రాజధాని అమరావతిని, దాని పురోగతిని నిర్వీర్యం చేశారు.  అమ‌రావ‌తిలో పూర్తిస్థాయి రాజ‌ధాని అనవసరం అని చాటడంతో పాటు మూడు రాజ‌ధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో సమాన అభివృద్ధి అంటూ మూడుముక్కలాటకు తెరతీశారు.  అమరావతిని నిర్వీర్యం అయితే చేశారు కానీ మూడు రాజధానుల విషయంలో కానీ ఒక్క కాయితం కదపలేకపోయారు, ఒక్క రాయీ వేయలేకపోయారు.

 రాజ‌ధానికి సంబంధించిన ప్ర‌తీ అంశంలోనూ తెలుగుదేశంపై విరుచుకుప‌డ‌టం త‌ప్ప వాస్త‌వానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకించి చేసింది, చేస్తున్న‌ది ఏమీ లేదు.  పాల‌నా వికేంద్రీక‌ర‌ణ ఆలోచ‌న జ‌గ‌న్ సృష్టించిన స‌రికొత్త సిద్ధాంత‌మేమీ కాదు. పూర్వం నుంచీ అంద‌రికీ తెలిసిందే, మ‌న‌ దేశంలో ఎప్పటి నుంచో అమలులో ఉన్నదే. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆ కోవలోదే. అంతే కానీ.. రాజధానిని ముక్కలు చేసి పాలనా వికేంద్రీకరణ అనే వితండాన్ని తెరమీదకు తెచ్చిన జగన్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ఈ మూడేళ్లలో ముందుకు వేయలేదు. దార్శినికత కాదు కదా..కనీస చూపుకూడా లేని పాలనా విధానమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నా చలించలేదు. అన్నీ గ్రాఫిక్స్‌లోనే చూపుతారా నిర్మాణం చేపట్టరా అని చంద్ర‌బాబును ఎద్దేవా చేసిన  జగన్  తన సొంత నియోజకవర్గం పులివెందులలో కనీసం బస్టాండ్ కూడా నిర్మించలేక గ్రాఫిక్స్ మీదే ఆధారపడుతున్నారు.

 జిల్లాకో మెడిక‌ల్ కాలేజీ అంటూ గ్రాఫిక్స్ లో నే సినిమా చూపారు తప్ప ఆ దిశగా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక జగనన్న కాలనీలు అంటూ ఆయన చేసుకున్న ప్రచారం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినానివ్వదు అన్నట్లుగా తయారైంది జగన్ పాలన. చంద్రబాబు గొప్ప విజన్ తో తలపెట్టిన అమరావతిని నిర్వీర్యం చేసి.. రాష్ట్రాన్ని రాజధాని లేని దిక్కు మాలిన రాష్ట్రంగా మార్చారు. నాడు శ్మసానం అన్న అమరావతే ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రానికి కల్పతరులా ఆదుకుంటోంది. నాడు జగన్ గ్రాపిక్స్ అని ఎద్దేవా చేసిన నిర్మాణాలే ఇప్పుడు కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంటున్నాయి. ఇటీవలే ఒక్కో టవర్ ఏడాదికి వంద కోట్ల లీజుకు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నాడు గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన టవర్లనే ఇప్పుడు లీజుకు ఇవ్వడానికి నిర్ణయించడం ద్వారా తాను నాడు చేసిన విమర్శలు, వ్యాఖ్యలూ అన్ని రాజకీయ లబ్ధి, అధికార దాహంతోనేనని జగన్ అంగీకరించినట్లైంది.  

అయితే గతంలో చంద్రబాబు ఏపీ అసెంబ్లీని డిజైన్ చేయించిన నార్మన్ పోస్టర్ సంస్థ తాజాగా దుబాయ్‌లో ఐసీడీసీ బ్రూక్‌ ఫీల్డ్స్ అనే ఓ చిన్న సైజ్ నగరాన్నే నిర్మించింది. ఎమ్ఇఎన్ఎ (మీనా) అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాలోనే అతి భారీ, అత్యంత పొడవైన నిర్మాణాల వాణిజ్య సముదాయం. ఈ నిర్మాణాలను చూసి ప్రతి ఒక్కరు అశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు.. మీనా అంటే ఏమిటీ.. ఎక్కడ ఉందని.. దీని నిర్మించింది ఎవరు అనే నెటిజన్లు సైతం గుగూల్‌ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. మీనా .. ఇది మొత్తం  19 దేశాల సమూహం  ప్రపంచంలోనే 65 శాతం ఇంధనం, 45 శాతం సహజ వాయువు ఈ దేశాల్లోనే దొరుకుతోంది. అటువంటి దేశాలకు శస్త్ర సాంకేతికతను ఈ నార్మాన్ పోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది.

అటువంటి ప్రముఖ సంస్థ.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసెంబ్లీ నిర్మాణాన్ని డిజైన్ చేసి ఇచ్చింది. దీనిని బట్టే అర్థమవుతోంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజనరీ ఏమిటో.. అద్భుత రాజధాని కోసం ఆయన పడిన తాపత్రేయం, తపన, కష్టం  కళ్లకు కడుతుంది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి.. జీరోతో ఆరంభమైన ఆంధ్రప్రదేశ్ ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలి. అమరావతి ఆదాయం రాష్ట్రానికే కాదు దేశానికీ ఉపయోగపడాలి అన్నది చంద్రబాబు విజన్.

  రెవెన్యూ లోటుతో ఆవిర్భవించిన రాష్ట్రాన్ని ఒక వైపు రాజధాని నిర్మాణం కోసం, మరో వైపు పోలవరం కోసం పెద్ద మొత్తంలో నిధులు వ్యయం చేస్తూనే రాబడి పెరిగే ప్రణాళికలతో దాదాపు అన్ని రంగాలలోనూ రాష్ట్రాన్ని పురోగమన దిశలో నడిపిన చంద్రబాబు విజన్ ను గుర్తించడంలో విఫలమయ్యామని ఇప్పుడు  తెలుగు ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అంతేకాదు  నార్మన్ పోస్టర్ నిర్మాణ సంస్థ చైర్మన్‌తో నాడు చంద్రబాబు అమరావతి డిజైన్ గురించి చర్చిస్తున్న ఫొటోలను చూస్తూ ఆయన దార్శనికతకు అబ్బుర పడుతోంది. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.  చంద్రబాబు విజన్ ను ఎగతాళి చేసి.. ఒకే ఒక్క చాన్స్ అంటూ అధికారంలోనికి వచ్చిన జగన్ ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒకే ఒక్క చాన్స్ అని కోరిన ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతికి చేరుకుంటి. మూడేళ్లుగా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటూ మొండి వైఖరితో ముందుకు సాగుతున్న జగన్ అభివృద్ధికి నోచని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను అగ్ర స్థానంలో నిలబెట్టారు. జగన్ పై జనం విశ్వాసం కోల్పోయారు. జనం చూపు ఇప్పుడు తెలుగుదేశంపైనే, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మళ్లీ ప్రగతి మార్గంలో నడుస్తుందన్న నమ్మకమే కనిపిస్తోంది.  రాష్ట్ర అభివృద్శిని కోరుకుంటున్న వారంతా   చంద్ర‌బాబు తిరిగి రావాల‌ని, ఆయ‌న దార్శ‌నిక‌త‌లో ముంద‌డుగు వేయాల‌న్న ఆకాంక్షతో ఉన్నారనడంలో సందేహం లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన విజనరీని దగ్గరుండి చూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ చంద్రబాబు అభిమానులుగా మారిపోయారు. అలిపిరి ఘటనలో గాయపడిన బాబును పరామర్శించేందుకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రొటోకాల్ ను సైతం పక్కన పెట్టి ఆసుపత్రికి వచ్చిన ఘటన చంద్రబాబు విజన్ కు ఆయన ఇచ్చిన గౌరవంగా చెప్పుకోవచ్చు. అలాగే బిల్ గేట్స్ పలు సందర్భాలలో చంద్రబాబు విజన్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు. దావోస్ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు వెళ్లిన సందర్భంగా బిల్ గేట్స్ ఆయనను కలిసేందుకు చేసిన ప్రయత్నమే చంద్రబాబుకు ఐటీ దిగ్జజం ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేస్తుంది.