ఐపీఎస్ సంజయ్ బెయిలు పిటిషన్ డిస్మిస్

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సీఐడీ మాజీ  అదనపు డైరెక్టర్‌ జనరల్‌,  అగ్నిమాపకశాఖ డీజీగా పనిచేసిన ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌ కుమార్‌కు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన   బెయిల్‌ పిటిషన్‌ను   ఏసీబీ ప్రత్యేక  కోర్టు సోమవారం (అక్టోబర్ 13) డిస్మిస్ చేసింది.  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్మెంట్‌ విభాగం ఇచ్చిన నివేదికలో, సంజయ్‌ డీజీగా, సీఐడీ ఏడీజీగా ఉన్న సమయంలో సుమారు  15 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు  దుర్వినియోగమయ్యాయని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో టెండర్‌ నిబంధనలు ఉల్లంఘించడం, సొమ్ము దుర్వినియోగం చేయడం, పలు పనులు అసంపూర్తిగా వదిలేయడం  వంటి అంశాలపై కూడా ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా అగ్నిమాపకశాఖలో అమలు చేసిన   అగ్ని ఎన్వోసీ వెబ్ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలింది. కాగా ఈ కేసులో  హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిలును సుప్రీంకోర్టు  రద్దు చేయడంతో, సంజయ్‌ స్వయంగా ఏసీబీ ఎదుట లొంగిపోయారు. అనంతరం  ఆయనను 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపారు. తదుపరి విచారణలో సంజయ్‌పై మరిన్ని ప్రశ్నలు అడగాల్సి ఉందని ఏసీబీ  అధికారులు వెల్లడించారు. గత వారంలో ఏసీబీ బృందం ఆయనను మూడు  రోజులపాటు విచారించింది.  

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విచారణ కొనసాగుతున్నందున సంజయ్‌  సస్పెన్షన్‌ను మరో 6 నెలలు పొడిగించింది. ఆయన ప్రస్తుతానికి విజయవాడ  సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. సంజయ్‌ కుమార్‌ 1996 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి. సీఐడీ, ఫైర్‌  సర్వీసెస్‌, హ్యూమన్‌ రైట్స్‌, ఎసిసి, ఎస్టి కమిషన్‌ వంటి కీలక విభాగాల్లో ఆయన  సేవలందించారు.  జగన్ హయాంలో సీఐడీ అదనపు డీజీగా ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu