ఎంపీ అర్వింద్ కారుపై దాడి.. బీజేపీ, టీఆర్ఎస్ ఫైటింగ్‌.. హైటెన్ష‌న్‌..

తెలంగాణ బీజేపీలో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ ఎవ‌రంటే.. బండి సంజ‌య్ అని చెబుతారు ఎవ‌రైనా. ఆయ‌న త‌ర్వాత ఆయ‌నంత ఫైర్ ఉన్న లీడ‌ర్ ఎవ‌రంటే.. ధ‌ర్మ‌పురి అర్విందే. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ దూకుడు మామూలుగా ఉండ‌దు. కేసీఆర్‌పై, టీఆర్ఎస్‌పై మాట‌ల‌ క‌త్తులు దూస్తుంటారు. బ‌స్తీ మే స‌వాల్ అంటూ తొడ‌గొడుతుంటారు. లేటెస్ట్‌గా.. అర్వింద్‌కు రా చూసూకుందాం అంటూ స‌వాల్ చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. ఎంపీ వాహ‌నంపై రాళ్ల దాడి చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. 

ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లి సమీపంలో టీఆర్ఎస్ శ్రేణుల రాళ్ల‌ దాడిలో అర్వింద్‌ కారు అద్దాలు ప‌గిలిపోయాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అర్వింద్ అనుచ‌రులు, బీజేపీ శ్రేణులు.. గులాబీ మూక‌ల‌పై ఎదురుదాడి మొద‌లుపెట్టారు. ఇరువర్గాల ఘర్షణతో హైటెన్ష‌న్ నెల‌కొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్మూర్‌లో బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

సుమారు 200 మంది టీఆర్ఎస్‌ కార్యకర్తలు తమకు అడ్డు తగిలారని.. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వేశారని.. అర్వింద్‌ ఆరోపించారు. ఈ విషయంపై సీపీ, ఏసీపీలతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ప‌ట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు. పోలీసులే దగ్గరుండి తమ వాహనాలపై దాడి చేయించారని అర్వింద్ అన్నారు. త‌న‌పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానని.. తమ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌.