మూడు దక్షినాది రాష్ట్రాలలో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు?

కర్ణాటక శాసన సభ గడువు ముగుస్తోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే మాసాల్లో, ఆ రాష్ట్ర్ర  శాసన సభకు ఎన్నికలు జరగవలసి వుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు  ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయా, అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.

నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా నిండా రెండేళ్ళ గడువుంది. తెలంగాణ అసెంబ్లీకి సంవత్సరం పైగానే సమయముంది. అయితే,  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజు పెరుగతున్న నేపధ్యంలో, ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. 
నిజానికి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలతో పాటుగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రెంత్ రెడ్డి ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి మొదలు ఆయన ఆలోచనలు స్థిరంగా ఉండడం లేదు. ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు మొదలు, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ఫ్రంట్  ఏర్పాటు వరకు అనేక ఆలోచనలు  చేస్తున్నారు. 

ఇందులో భాగంగానే కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే సెంటిమెంట్’ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకత కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ అంతగా ఫలించక పోగా, ఒక్కొక్క ప్రయత్నంతో రాష్ట్ర ప్రభుత్వం డొల్లతనం మరింతగా బయట పడుతోంది. ఉదాహరణకు వరి ధాన్యం కొనుగోలు పై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళన చేసినా, చివరకు రైతుల పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొంటోందని రైతులకు తెలిసి వచ్చింది. చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటోందని గత ఎనిమిది సంవత్సరాలుగా తెరాస చేస్తున్న ప్రచారంలో ఒక గింజంత నిజం లేదని రైతులకు తెలిసి పోయింది.అందుకే కొత్తగా దక్షణాది వర్సెస్ ఉత్తరాది అనే కొత్త నినాదంతో ముందుకు పోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగా మూడు దక్షణాది రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాలలో   ఒకేసారి ఎన్నికలుజరిగితే, దక్షిణాది సెంటిమెంట్ మరింగా పండుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే, కర్ణాటకలో జేడీఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో ఇదే విషయంపై మంతనాలు జరిపారని పార్టీ వర్గాల సమాచారం.

మరోవంక మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్న ఆంధ్ర్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అడుగంటి పోయిన నేపధ్యంలో, ముందస్తు ఎన్నికలకు పోవడం మినహా మరో మార్గం లేదని, నిర్ణయానికి వచ్చారు. ఇంత కాలం సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని గంపెడాశ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దిగజారిన ఆర్థిక పరిస్థితితో పాటుగా  వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, సమీకరణల నేపధ్యంలో ముందస్తు ఎన్నికల ఆలోచనకు మరింత పదును పెడుతున్నారని అంటున్నారు. ఓ వంక తెలుగు దేశం పార్టీ పడిలేచిన కెరటంలా దూసుకోస్తోంది. ముందస్తు ఎన్నికను ముందుగానే పసిగట్టిన, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా విసురుతున్న సవాలు అధికార వైసీపీలో వణుకు పుట్టిస్తోంది. 

అందుకే గడప గడపకు .. ప్రభుత్వం పేరిట ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన వైసీపీ ఇప్పుడు, సామాజిక న్యాయం పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు బస్సు యాత్ర సాగిస్తున్నారు. నిజమే, గడప గడపకు ... కార్యక్రమంలో ఎదురైన చేదు అనుభవమే, బస్సు యత్రలోనూ కనిపిస్తోంది. గతంలో స్వయంగా జగన్ రెడ్డి ‘ఒక్క ఛాన్స్’ అని జనాలను వేడుకుంటే, ఇప్పడు మంత్రులు సామాజిక న్యాయం ముసుగులో , మరొక్క సారి  జగన్‌ రెడ్డిని ముఖ్యమంత్రికి చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను మంత్రులు వేడుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉండగా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు,  కార్యకర్తలు రోడ్డెక్కడం… ముందస్తు ఎన్నికలకు సంకేతమని రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది.  

ముందస్తు ఎన్నికల ఆలోచన మనసులో ఉంది కాబట్టే, ముఖ్యమంత్రి పార్టీ నేతలందరినీ గడపగడపకు పంపడమే కాకుండా.. సామాజిక న్యాయం పేరుతో కొత్తగా పదవులిచ్చిన వారితో యాత్ర కూడా చేయిస్తున్నారు. ఓ రకంగా అది ఎన్నికల ప్రచారమే అనుకోవచ్చు. వచ్చే నెలాఖరులో ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరగనుంది. అక్కడ గెలిచి  వైసీపీకి తిరుగులేదన్న అభిప్రాయం కల్పించడం కోసం భారీగా ప్రచారం నిర్వహింప చేసుకుని నవంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి.. వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్న ప్లాన్‌లో ఉన్నారని వైసీపీ నాయకులు చెపుతున్నారు. అదే సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీని రద్దు చేస్తారని, ఆ విధంగా మూడు దక్షణాది రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.