ఉమేష్ చంద్ర హత్యలో ఆశన్న కుట్ర పథకం
posted on Oct 18, 2025 1:24PM

అది 1999 సెప్టెంబర్ 4. స్థలం ఎస్సార్ నగర్ జంక్షన్. ఎప్పటిలాగానే ఐపీఎస్ ఉమేశ్ చంద్ర.. తన మారుతీ వ్యాన్ లో డ్యూటీకి బయలుదేరారు. ఇంతలో అనుకోని ఒక దాడి. ఎప్పటి నుంచో కాపు కాచిన నక్సల్స్ యాక్షన్ టీమ్.. ఒక్కసారిగా కాల్పుల మోత మోగించింది. డ్రైవర్, ఉమేష్ పీఏ అక్కడికక్కడే చనిపోగా.. ఆయుధం లేని ఉమేష్ చంద్ర.. వెంటనే కారు బయటకొచ్చి.. నక్సల్స్ ని పట్టుకుందామని ప్రయత్నించారు. కట్ చేస్తే ఆయన దగ్గర ఆయుధం లేదని గుర్తించిన నక్సల్స్.. వెంటనే ఆయన మీదకు ఎదురు దాడికి తెగబడ్డారు. దీంతో వెనక్కు తగ్గిన ఆయన దగ్గరకు వచ్చి కాల్పులు జరిపారు. దీంతో ఉమేష్ చంద్ర మరణించారు.
ఈ మొత్తం యాక్షన్ ప్లాన్ వెనక కీలక సూత్రధారి మరెవరో కాదు.. శుక్రవారం (అక్టోబర్ 17) లొంగిపోయిన ఆశన్న. వీళ్లు మొత్తం మూడు యాక్షన్ టీములుగా ఏర్పడి.. మూడు నెలల పాటు రెక్కీ నిర్వహించి.. ఈ దాడికి పాల్పడ్డారు. అదెంతగా అంటే, ఏకంగా ఉమేష్ చంద్ర ఇంట్లోకి కూరగాయల వాళ్ల రూపంలో ఇతరత్రా పనివాళ్ల రూపంలో చొరబడేంత. కట్ చేస్తే ఆయన కదలికలేంటి? ఏయే సమయాల్లో నిరాయుధంగా వెళ్తుంటారు. ఏ రూట్లో వెళ్తుంటారు వంటి అనుపానులన్నీ పసిగట్టిన మరీ ఉమేష్ చంద్రను హతం చేశారు. ఈ మొత్తం వ్యవహారం అంతా ఆశన్న నాయకత్వంలోనే జరిగింది.
కారణమేంటని చూస్తే ఉమేష్ చంద్రకు కడప పులి అన్న పేరుండేది. అంతే కాదు.. ఆయన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారిగా పని చేశారు. నక్సల్స్ పై ఉక్కు పాదం మోపారు. ఇది మనసులో పెట్టుకున్న నక్సలైట్లు ఆయన్న హతమార్చడానికి చేసిన పథక రచన సూత్రధారి ఆశన్నే. అయితే ఆశన్న కూడా ఆనాడే పోలీస్ ఎన్ కౌంటర్లో చనిపోయి ఉండేవాడు. అప్పటికీ పోలీసు ఇన్ఫార్మర్ల ద్వారా ఈ దాడిలో పాల్గొన్న యాక్షన్ టీమ్ సభ్యులు వెళ్తున్న ఆటోను అటకాయించిన పోలీసులు. వారిని కాల్చి చంపేశారు. అయితే వెనకే బైక్ పై మరొకరితో వస్తున్న ఆశన్న ఇది గుర్తించి.. అటు నుంచి అటే పరారయ్యాడు. దీంతో ఇన్నాళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా, అజ్ణాతంలో గడిపిన ఆశన్ని ఇప్పుడు ఆయుధాలు అప్పగించి సరెండర్ అయ్యారు. ఇదీ ఉమేష్ చంద్ర మరణానికి ఆశన్నకూ ఉన్న సంబంధం.