పుట్ట మ‌ధు.. పుట్ట‌లో పాములెన్ని? ఉచ్చు బిగించారా? జెడ్పీ పీఠం ఎవ‌రికి?

పుట్ట మ‌ధు. ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌. కేసీఆర్ టార్గెట్ చేస్తే ఎట్ల‌ ఉంటదో తెలిసేలా చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ జిల్లా ప‌రిష‌న్ ఛైర్మ‌న్‌ను.. ఆ అధికార పార్టీనే వెంటాడుతోంది. వేటాడేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మాజీ మంత్రి ఈట‌ల ఎపిసోడ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచీ అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మ‌ధును.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు భీమ‌వ‌రంలో ప‌ట్టుకున్నా విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌ధును.. పోలీసులు విచారిస్తున్నారు. లాయ‌ర్ వామ‌న‌రావు దంప‌తుల మ‌ర్డ‌ర్ కేసులో ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. పోలీసుల విచారణలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నోరు విప్పడం లేదు. అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారంటే.. అదే పొరపాటు జరిగిందంటూ స‌మాధానం చెప్పాడ‌ని తెలుస్తోంది. న్యాయవాదుల హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పుట్ట మధు చెబుతున్నట్లు తెలుస్తోంది. 

ఇంత జ‌రుగుతున్నా.. ఇప్ప‌టికీ పుట్ట మ‌ధు టీఆర్ఎస్ నాయ‌కుడే. మ‌ధును పార్టీ నుంచి, జ‌డ్పీ ఛైర్మ‌న్ పదవి నుంచి తొలగించే అంశంపై టీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. రేపోమాపో వేటు ఖాయం. మ‌రోవైపు, జడ్పీ చైర్మన్ పదవి కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కందుల సంధ్యారాణిని పెద్ద‌ప‌ల్లి జెడ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఎంపిక చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ మేర‌కు త్వ‌ర‌లోకే కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. 

ఇక‌, పుట్ట మ‌ధుతో పాటు ఆయ‌న భార్య పుట్ట శైలజను కూడా పోలీసులు విచారించనున్నారు. ఆమెతో పాటు కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌ను కూడా విచారిస్తున్నారు. ఫిర్యాదుదారు గట్టు కిషన్‌రావును కూడా పిలిపించి మాట్లాడారు. ‘‘హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతులను హత్య చేసేందుకు హంతకులకు రూ.2 కోట్ల సుపారీ ఇచ్చిందెవరు? బిట్టు శ్రీను కారు కొనేందుకు డబ్బులు ఎవరిచ్చారు? కుంట శ్రీనివాస్‌ ఇంటి నిర్మాణం ఎలా జరుగుతోంది?’’ పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ విచారణలో భాగంగా పోలీసులు ఆరా తీస్తున్న అంశాలివి. వీటిపై  నిజానిజాలను రాబట్టేందుకు పుట్ట మధుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా బ్యాంకు మేనేజర్లకు పోలీసులు లేఖలు రాశారు. వారి కాల్‌ డేటానూ క్షుణ్ణంగా పరిశీస్తున్నారు. ఈ కేసులో పుట్ట మధు ప్రమేయం ఉన్నట్లుగా తేలితే ఆయనను రిమాండ్‌ చేయవచ్చని తెలుస్తోంది. 

పుట్ట మ‌ధు ఆర్థిక లావాదేవీలు, ఫోన్‌ కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును గత మార్చి నెలలో కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా పుట్ట మధు భార్య శైలజ అక్కడికి వచ్చారు. తన ఫోన్‌ నుంచి ఎవరికో ఫోన్‌ చేసి బిట్టు శ్రీనుతో మాట్లాడించారు. ఈ వ్యవహారంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదు మేరకు ఆమెపై మంథని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఆమె ఎవరికి ఫోన్‌ చేసి బిట్టు శ్రీనుతో మాట్లాడించారనే విషయమై కూడా పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు నాలుగు రోజుల క్రితం ముత్తారం, మంథని, రామగిరి ఎస్‌ఐల బదిలీ జరగగా, ఆదివారం మంథని సీఐ జి.మహేందర్‌రెడ్డిని వరంగల్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం పుట్ట మధు వ్య‌వ‌హారంపై ఎంత సీరియ‌స్‌గా ఉందో అర్థమవుతోంది. పుట్ట మ‌ధు రిమాండ్‌ త‌ప్ప‌దంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.