ఇక రెండో దశ ఉద్యమం.. సీఎం జ‌గ‌న్‌కి ఉద్యోగ సంఘాల వార్నింగ్‌..

ఉద్యోగులు పీఆర్సీ అడుగుతున్నారు. ప్ర‌భుత్వం ఇస్తామంటోంది కానీ ఇవ్వ‌ట్లేదు. అదిగ‌దిగో అంటూ ఆశ చూపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు గ‌డువు దాటేస్తోంది. లేటెస్ట్‌గా 10 రోజుల్లో పీఆర్సీ అని స్వ‌యంగా సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించారు. అందులో ఇప్ప‌టికే ముచ్చ‌ట‌గా మూడు రోజులు ముగిశాయి. క‌నీసం పీఆర్సీ రిపోర్ట్ కూడా బ‌హిర్గతం చేయ‌ట్లేదంటే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలో, ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదంటున్నారు ఉద్యోగులు. అందుకే, ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌న్నా మేమే.. నిల‌బెట్టాల‌న్నా తామే నంటూ ఇప్ప‌టికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. తాజాగా, ముఖ్య‌మంత్రి సొంత ఇలాఖా క‌డ‌ప‌లో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమ‌రావ‌తి నేత‌లు స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించారు. ఇంత‌కీ ఉద్యోగ సంఘ నేత‌లు ఏమ‌న్నాయంటే....

"రెండు జేఏసీల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు. 11వ  పీఆర్‌సీ అమలు చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. ఎప్పటికప్పుడు ఇస్తామంటూనే 7 డీఏలు పెండింగ్‌లో పెట్టారు. తమ ప్రభుత్వం రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ చెప్పారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా పెండింగ్‌లోనే ఉంది. వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ జరగడం లేదు. మా సమస్య వినే స్థితిలో ప్రభుత్వం లేదు. అందుకే రోడ్లపైకి రావాల్సి వచ్చింది." అంటూ ఉద్యోగులు స్ప‌ష్టం చేశారు. 

"మేము దాచుకున్న రూ.1,600 కోట్లు కూడా ఇవ్వలేదు. అడ్వాన్స్ ఇవ్వమని అడిగితే ఇంత వరకు ఇవ్వలేదు. ఉద్యోగుల బిడ్డల వివాహం కూడా వాయిదా వేసుకుంటున్నాం. చివరికి జీపీఎఫ్‌ డబ్బులు కూడా ప్రభుత్వం ద‌గ్గ‌ర‌ దాచుకోలేని భయం ఉద్యోగుల్లో కలిగింది. ఈ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. మంగ‌ళ‌వారం నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తాం. ప్రతి ఉద్యోగి నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతాం. ఈ నెల 16న అన్ని కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం దిగిరాకుంటే రెండో దశలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం" అని ఉద్యోగ సంఘాల నేత‌లు తేల్చి చెప్పారు. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు మ‌రోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.