చర్చల్లేవ్‌... 21న సమ్మె నోటీస్‌.. ఉద్యోగులు త‌గ్గేదేలే..

స‌ర్కారు స‌న్నాయినొక్కులు ప‌ని చేయ‌లే. జ‌గ‌న‌న్న పీఆర్సీ ఉద్యోగుల‌కు న‌చ్చ‌లే. సీఎస్‌తో చ‌ర్చ‌లు కొలిక్కిరాలే. ఇక‌, త‌గ్గేదేలే. స‌మ్మెకు సై.. అంటున్నారు ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు. పీఆర్సీ ప్ర‌క‌టిస్తే జీతాలు పెర‌గాలి కానీ, త‌గ్గ‌డ‌మేంటంటూ మండిప‌డుతున్నాయి. పీఆర్‌సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను బేషరతుగా రద్దు చేయాలని ఏపీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

విజయవాడలోని ఎన్జీవో కార్యాలయం ద‌గ్గ‌ర‌ పీఆర్సీ జీవోలను దహనం చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం... ప్రతి ఒక్క ఉద్యోగికి 6 నుంచి 7వేల వరకు జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొత్త పీఆర్‌సీ వద్దు.. డీఏలతో కూడిన 27శాతం ఐఆర్‌ ఇస్తున్న పాత జీతమే ముద్దు’ అని కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. 

ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఉద్యోగులు తమ భవిష్యత్తును తాకట్టుపెట్టేందుకు సిద్ధంగా లేరన్నారు. పీఆర్స్‌పై సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని, 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు ఉద్యోగ సంఘ నేత‌లు. ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదని, పీఆర్సీ జీవోలు రద్దు చేసిన తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి.