అంబులెన్సులు ఆపడం అమానుషం! సీఎంలే పరిష్కరించాలన్న రేవంత్ 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. ఏపీ నుంచి వచ్చే కొవిడ్ పేషెంట్లను తెలంగాణ సరిహద్దుల్లో అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. తెలంగాణ పోలీసుల తీరుతో సరిహద్దుల్లో వందలాది అంబులెన్సులు నిలిచిపోయాయి. తమకు పంపించాలంటూ కొవిడ్ రోగుల బంధువులు వేడుకుంటున్నా తెలంగాణ పోలీసులు కనికరించడం లేదు. దీంతో సీరియస్ ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. 

తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలపై ఏపీ రాజకీయ నేతలు, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసమర్ధతవల్ల ఏపీ ప్రజలకు పొరుగు రాష్ట్రాల్లోనూ వైద్యం అందడం లేదన్నారు. తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్సులను ఆపితే సీఎం జగన్‌ కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా మాట్లాడలేదని విమర్శించారు. జగన్‌కు కేసీఆర్‌ చేసిన ఎన్నికల సాయంతో ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందన్నారు. నాణ్యమైన వైద్యం అందక అమరావతి లేని లోటు ప్రజలకు తెలుస్తోందన్నారు. 

హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇది అత్యంత అమానవీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ భారత దేశంలో అంతర్భాగంగా ఉందా? లేక ప్రత్యేక దేశమా? అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన చేతగాని తనాన్ని  చూపించుకోడానికి ఈ రకంగా అంబులెన్స్‌లు ఆపడమంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటిలేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా రోగులపై కరుణ, మానవత్వం చూపడం లేదని ఏపీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల వద్ద అంబులెన్సులు అటు ఇటు స్వేచ్ఛగా అనుమతించాలన్నారు. తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు కలసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. 

తెలంగాణలోకి ఏపీకి చెందిన అంబులెన్స్‌ను అనుమతించకపోవడంపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పందించారు. వెంటనే జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే... తెలంగాణ పోలీసులతో మాట్టాడారు. పర్మిషన్ ఉన్న అంబులెన్స్‌లను తెలంగాణలోకి పంపించాలని కోరారు. హైదరాబాద్ హాస్పిటల్‌లలో చేరేందుకు పర్మిషన్ లేని రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స చేయాల్సిందిగా జీజీహెచ్ అధికారులకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సూచించారు. 

ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు చికిత్స కోసం వ‌చ్చే క‌రోనా రోగుల అంబులెన్సుల‌ను చెక్‌పోస్టుల్లో అడ్డుకోవ‌డం స‌రికాదని ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాన‌వత్వంతో ఆలోచించి ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌క్ష‌ణమే ఈ స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఏపీ క‌రోనా రోగుల‌కు తెలంగాణ‌లోకి అనుమ‌తి లేక పోవ‌డంతో య‌స్‌.శివారెడ్డి అనే వ్య‌క్తిని క‌ర్నూలు ఆస్ప‌త్రిలో చేర్పించ‌డం జ‌రిగిందన్నారు. క‌రోనా రోగుల అనుమ‌తి విష‌యంలో నెల‌‌కొన్న ప్ర‌తిష్టంభ‌న తొల‌గించే దిశ‌గా రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు.