సచివాలయంలో క‌రోనా డెత్‌.. ఉద్యోగుల్లో టెన్ష‌న్‌

ఏపీ సచివాలయంలో కరోనాతో ఉద్యోగి చ‌నిపోవ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పని చేసే వి. పద్మారావు కొవిడ్‌తో కన్నుమూశారు. దీంతో సచివాలయం ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. 

సెకండ్ వేవ్ క‌రోనా క‌ల్లోలం మొద‌ల‌య్యాక ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో పాజిటివ్ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. వివిధ విభాగాల్లో ఇప్పటికే 50 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో సచివాలయంలో పని చేసేవారికి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా, సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. భారీగా పాజిటివ్ కేసులు నమోదైన‌ట్టు తెలుస్తోంది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబాలకు కరోనా వైరస్ సోకింది.

కొవిడ్‌ భయంతో ఉన్నతాధికారులు మాత్రం విజయవాడ, గుంటూరుల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కారణంగా మరోసారి ‘వర్క్‌ ఫ్రం హోం’ ఇవ్వాల్సిందిగా ఉద్యోగులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.