ఫైవ్ పర్సెంట్ కచ్చితంగా ఇవ్వాల్సిందే! జగనన్న పాలనలో కొత్త రూల్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంతా స్పెషలే. జీవోలను రహస్యంగా ఉంచడం నుంచి కొత్త కొత్త పన్నులు వేయడం వరకు అంతా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అమలవుతోంది. జగన్ పాలన అంతా రివర్స్ అనే విమర్శలు ఉన్నాయి. ఖజానా ఖాళీ కావడం, కొత్తగా అప్పులు పుట్టే అవకాశాలు లేకపోవడంతో.. కొత్త కొత్త ఎత్తులు వేస్తోంది జగన్ సర్కార్. ఏదో రకంగా జనాల నుంచి డబ్బులు పిండుకోవాలని చూస్తోంది. రోజుకో పన్ను విధిస్తూ జీవోలు ఇస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది.  ఆ జీవోనే  విచిత్రంగా ఉందనే టాక్ వస్తోంది. 

జగన్ సర్కార్ ఇచ్చిన కొత్త జీవో ప్రకారం ఇక నుంచి ఏపీలో ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నా ఐదు శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల్సిందే. అది స్థలం రూపంలో కాని డబ్బు రూపంలో అయినా ఇవ్వొచ్చు. అది ఇచ్చే వాళ్ల ఇష్టం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసే ప్రైవేటు వెంచర్లలో ఐదు శాతం జగనన్న కాలనీలకు ఇవ్వాలనేది ప్రభుత్వ తాజా నిర్ణయం. అయితే ఆ వెంచర్లలోనే ఇవ్వాలనేం లేదు. కాస్త దూరంగా అయినా ఇవ్వొచ్చు.. లేదా డబ్బులు కూడా కట్టొచ్చు. 

ఏపీ సర్కార్ తాజా నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవాక్కవుతున్నారు. ఇప్పటికే ఏపీలో రియల్ వ్యాపారం కుదేలైంది. జగనన్న మూడు రాజధానుల ప్రతిపాదనతో రియల్ రిస్టేట్ రంగం ఢమాల్ అయింది. రాజధాని ఎక్కడో తెలియని గందగగోళంలో రియల్ వ్యాపారులు సైలెంటుగా ఉండిపోయారు. అటు అమరావతిలో వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు శాతం ఇవ్వాలన్న జగన్ సర్కార్ నిర్ణయం రియల్ వ్యాపారులకు షాకింగ్ గా మారింది. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే రోడ్లకు.. ఇతర అవసరాలకు స్థలం వదిలేయడమే కాకుండా  పది శాతం సామాజిక అవసరాలకు వదిలి పెడతారు. ఇప్పుడు అదనంగా మరో ఐదు శాతం అంటే.. ఇక ఎకరం స్థలంలో వెంచర్ వేస్తే అర ఎకరం కూడా అమ్ముకోవడానికి ఉండదని చెబుతున్నారు.  

ఇక ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాల్లో ప్రభుత్వ పథకానికి కొంత ఇవ్వాలని ఉత్తర్వులు ఇవ్వడం ఏ చట్టం ప్రకారం న్యాయబద్ధమో ఎవరికీ తెలియడం లేదు. తమకు అధికారం ఉంది కాబట్టి ఉత్తర్వులు ఇస్తాం.. చెల్లింపులు చేయాల్సిందే అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందు ముందు ప్రజల సంపాదనలో ప్రభుత్వ పథకాలకు కొంత మొత్తం ఇవ్వాలన్న నిబంధనలు కూడా తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. ఓటు బ్యాంక్‌కు పథకాలు అమలు చేయడానికి నిధుల కోసం ఇలా ఇతర వర్గాల మీద దాడి జరుగుతోందన్న అభిప్రాయం కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.  ఇలాంటి వింత పోకడలతో ఏపీ ప్రభుత్వం.. చట్టాలను, రాజ్యాంగాలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.