లారీలు అడ్డుపెట్టి.. దేవినేని కాన్వాయ్‌ని అడ్డ‌గించి.. ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు ఫైర్‌..

దేవినేని ఉమాపైనే దాడి చేశారు. మాజీ మంత్రినే అడ్డుకున్నారు. ఆ త‌ర్వాత బాధితుడిపైనే అడ్డ‌గోలుగా కేసులు పెట్టారు. అర్థ‌రాత్రి హైడ్రామా చేశారు.బెయిల్ రాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపారు. అరెస్ట్ చేసి జైలుకు కూడా త‌ర‌లించారు. అయినా, పాల‌కుల‌కు దేవినేనిపై క‌సి తీర‌న‌ట్టుంది. ప్ర‌భుత్వాన్ని ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తున్నార‌ని కాబోలు మ‌రోసారి అదే దుస్సాహ‌సానికి తెగించారు. హైకోర్టు దేవినేని ఉమాకు బెయిల్ ఇవ్వ‌డంతో తాజాగా రాజ‌మండ్రి జైలు నుంచి విడుద‌ల‌య్యారు. ఉమాకు మ‌ద్ద‌తుగా తెలుగుదేశం శ్రేణులు త‌ర‌లిరావ‌డంతో.. త‌మ్ముళ్ల తోడుగా భారీ కాన్వాయ్‌తో విజ‌య‌వాడ బ‌య‌లు దేరారు. దేవినేని ఆద‌ర‌ణ‌, ఘ‌న‌స్వాగ‌తం చూసి పాల‌కుల‌కు, పోలీసుల‌కు మ‌రోసారి క‌ళ్లుమండిన‌ట్టున్నాయి. బెజ‌వాడ వ‌స్తున్న దేవినేని కాన్వాయ్‌ను మార్గ‌మ‌ధ్య‌లో.. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా జాతీయ ర‌హ‌దారిపై అడ్డుకున్నారు పోలీసులు. ఏకంగా లారీలు, జీపులు అడ్డుపెట్టి వాహ‌న శ్రేణిని అడ్డుకోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది.  

రాజ‌మండ్రి నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోకి రాగానే ఉమా కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రహదారికి అడ్డంగా లారీలు, ట్రక్కులు పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనాలను రోడ్డుపైనే నిలిపివేశారు. దేవినేని ఉమా ప్రయాణిస్తున్న ఒక్క కారును మాత్రం పంపిచేసి ఆయ‌న వెంట ఎవ‌రూ వెళ్ల‌కుండా కుట్ర చేశారు. కాన్వాయ్‌లోని మిగతా కార్లను అడ్డుకోవ‌డంపై దేవినేని ఉమా, పట్టాభి త‌దిత‌ర‌ నేతలు అక్కడే నిరసన చేప‌ట్టారు. దీంతో భీమడోలులో ఉద్రిక్తత త‌లెత్తింది. పోలీసుల తీరుతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగింది.   

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం దారుణ‌మంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిప‌డ్డారు. హింసించి ఆనందించడం సీఎం జగన్‌కు పరిపాటిగా మారిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జనం నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జాతీయరహదారిపై పోలీసులు ఏవిధంగా వాహనాలు ఆపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. చట్టాన్ని అధికార పక్షం వాళ్లు చుట్టంలా మార్చుకున్నారని ఆరోపించారు. 

అంత‌కుముందు, జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక దేవినేని ఉమా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా న్యాయదేవత అనుగ్రహంతో విడుదలయ్యానన్నారు. అక్రమ నిర్బంధాలతో తమ పోరాటం ఆగదంటూ జ‌గ‌న్ స‌ర్కారును హెచ్చ‌రించారు.