ఈవోకు చెక్.. జీతాలకు లైన్ క్లియర్! మాన్సాస్ కేసులో హైకోర్టు ఆదేశాలు 

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజుకు ఇబ్బందులు కలిగించేలా జగన్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుకు చెక్ పడింది. ఈవో ద్వారా ప్రభుత్వం వేస్తున్న ఎత్తులకు ఏపీ హైకోర్టు బ్రేకులు వేసింది. ట్రస్ట్ సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ట్రస్ట్ అకౌంట్స్ సీజ్ చేయాలంటూ ఈవో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ట్రస్ట్ కింద ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఈవోను ఆదేశించింది. పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది.

టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజు పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ తన ఆదేశాలు పాటించడం లేదని అశోక్‌గజపతి రాజు పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది.  స్టేట్ ఆడిట్ అధికారులు ఆడిట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. పాలకమండలి ఏర్పాటు జీవో 75పై కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది.మాన్సాస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌ (ఈవో)పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈవో పాత్ర ఏమిటి? ఏం చేస్తారో చెప్పాలని నిలదీసింది. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతి ఆదేశాలను పాటించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

ట్రస్ట్ చైర్మన్‌కు లేఖ రాసేముందు కోర్టు తీర్పును ఎందుకు చూడలేకపోతున్నారని ఈవోను హైకోర్టు ధర్మాసనం  ప్రశ్నించింది. కాగా ఆడిట్ పేరిట ఎవరెవరో వస్తున్నారని సీనియర్ న్యాయవాది జీవీ సీతారామమూర్తి, న్యాయవాది అశ్విని కుమార్‌లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆడిట్‌తో ఈవోకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ.. మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు నోటీసులు జారీ చేసింది.