మద్యం పాలసీ.. మరో బాంబు పేల్చనున్న ఏపీ సర్కార్!!
posted on Oct 11, 2019 12:55PM

నవరత్నాలల్లో ఒకటైన మద్యం నిషేధం పై ప్రభుత్వం పై తీవ్ర దృష్టి పెడుతోంది. మద్య నిషేధం దిశగా మరో కీలక అడుగు వేసే యోచనలో ఏపీ సర్కారు ఉంది. రెండు వేల ఇరవై రెండు వరకు లైసెన్సు ఉన్న బార్ల వేళలను కుదించడమే కాక పూర్తిగా రద్దు చేయడమా అనే అంశం కూడా ఆలోచన నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది.ప్రస్తుత నిబంధన ప్రకారం మందు బాబులు బార్లకు వెళ్లి మద్యం సేవిస్తున్నారని వాటిని కూడా మూసివేస్తే మంచి పేరు వస్తుందని కొందరు అధికారులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
మద్య నిషేధం దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోంది. రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన వైసీపీ ఏడాదికి ఇరవై శాతం చొప్పున మద్యం దుకాణాన్ని మూసేస్తామని బెల్టు షాపులు పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించింది.అయితే బెల్టు షాపుల్ని ఇప్పటికే తొలగించగా ఈ ఏడాది మద్యం దుకాణాలు ఇరవై శాతం తగ్గించి మూడు వేల ఐదు వందల షాపులు మాత్రమే ఏర్పాటు చేసింది వీటిని కూడా ప్రభుత్వమే ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించడం ప్రారంభించింది.ఈ షాపుల వేళలు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కుదించింది. అయితే రాత్రి ఎనిమిది గంటల కు మద్యం దుకాణాల మూతపడుతుండటంతో మద్యం ప్రియులు బార్లకు వెళ్లి మద్యం సేవిస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది పైగా ప్రభుత్వం కూడా మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యానికి ఫుల్ బాటిల్ కు ఎనభై రూపాయల చొప్పున పెంచింది. ఈ పరిణామంతో బార్ల వ్యాపారం పెరిగింది.మందు బాబులకు ఖర్చు తడిసి మోపెడవుతోందని తెలియడంతో బార్లో వేళలు కూడా కుదించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మద్యం షాపులు మాదిరిగా చేయాలని భావిస్తున్న తరుణంలోనే మరికొంతమంది అసలు బార్ల లైసెన్స్ ను కూడా ఉపసంహరిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని కూడా పలువురు కీలక నేతలకు సూచించారు.
రాష్ట్రంలో ఎనిమిది వందల బార్లున్నాయి.ఇందులో విజయవాడ, గుంటూరు,విశాఖపట్నం నగరంలోని సుమారు యాభై శాతం వరకు ఉన్నాయి. అయితే యజమానులు అక్రమాలకు పాల్పడే సమయంలో లైసెన్స్ సస్పెండ్ చేయడం లేదా రద్దు చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ ముప్పై రెండు ప్రకారం సస్పెన్షన్, క్యాన్సిలేషన్, విత్ డ్రాకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ హయాంలో 1995 జనవరి 17న రాష్ట్రంలో మద్య నిషేధం విధించారు. అయితే లైసెన్స్ 1997 మార్చి 31 వ తేదీ వరకు ఉంది. దీని పై మద్యం షాపుల యజమానులు ఆ సమయంలో హైకోర్టునాశ్రయించారు విచారణ తర్వాత సెక్షన్ ముప్పై రెండు ప్రకారం లైసెన్సులను వితడ్రా చేసే అధికారం ఉందని ఇందులో ఎటువంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేసింది.ప్రస్తుతం మద్యం వ్యాపారులు కొందరు అప్పటి హై కోర్టు తీర్పును ఉదాహరిస్తున్నారు. మద్యం షాపుల్ని ఏపీబీసీఎల్ నిర్వహిస్తుండగా ఇంటి దగ్గర మద్యం సేవించలేదని మందు బాబులు గతంలో షాపులు బాటిల్ కొనుగోలు చేసి పర్మిట్ రూమ్ లో కూర్చొని మద్యం సేవించేవారు. కానీ ఇప్పుడు ఆ పర్మిట్ రూమ్ లు లేకపోవటం తో బార్లకు వెళ్లడం ప్రారంభించారు. దీని వల్ల వారికి ఖర్చు పెరిగిపోయిందని చెబుతున్నారు.వేళలు కుదించటం ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయాలకు పూనుకోవడం ద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుండగా అందుకు విరుద్ధంగా ప్రభుత్వానికి మందు బాబుల నుంచి శాపనార్థాలు పెరగటంతో బార్ల లైసెన్స్ ను కూడా ఉపసంహరిస్తే ఎలా ఉంటుందనే చర్చ ప్రారంభమైంది.ఇప్పుడు ఈ అంశంపై మద్యం వ్యాపార వర్గాల తర్జన భర్జన పడుతున్నాయి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దామ లేదా అనే అంశంపై కూడా సతమత పడుతున్నారు. తమకు ఎలాంటి సంకేతం లేనప్పుడు ఎందుకు తొందరపడాలని కొంత మంది మద్యం వ్యాపారులు అంటున్నారు.జగన్ సర్కార్ నిజంగానే నిర్మూలించే అవకాశలు కొంతమెరకు కనిపిస్తున్నాయి.