సీఎస్‌కు ఉద్యోగ జేఏసీ నోటీస్.. వారం రోజుల డెడ్ లైన్! జగన్ సర్కార్ కు టెన్షన్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి సీఎస్ సమీర్ శర్మకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు నోటీస్ ఇచ్చారు. జేఏసీ నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసు ఈ నోటీస్‌ను సీఎస్ కు అందించారు, 11 పీఆర్సీ అమలు, డిఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్స్‌ల చెల్లింపు షెడ్యూల్‌ వంటి డిమాండ్లు అందులో ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై జేఏసీ నేతలు ఒత్తిడి చేయనున్నారు.  

పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నామని ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. 7వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్‌ సమీర్‌శర్మ హామీ ఇచ్చారని చెప్పారు. ఐదు పేజీల ఉద్యమ కార్యాచరణ లేఖను నోటీసు రూపంలో సీఎస్‌కు అందించామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 7వ తేదీ నుంచి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తారని, 10వ తేదీ మధ్యాహ్నం భోజన విరామంలో నిరసనలు చేస్తామని, 13న తాలూకా, డివిజన్‌ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. 27 నుంచి విశాఖ, తిరుపతి, ఏలూరు సహా నాలుగు చోట్ల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తామని బొప్పరాజు తెలిపారు.    సర్కార్ స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

స్నేహపూర్వక గవర్నమెంట్‌ అని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు కన్నీటి మూటలే అయ్యాయని జేఏసీ నేతలు మండిపడ్డారు. జీపీఎఫ్‌ బిల్లులను వెంటనే క్లియర్‌ చేయాలని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో  5వేల మంది ఉద్యోగులు చనిపోయారని, ప్రభుత్వం కారుణ్య నియామకాలు జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరించడం లేదని నిలదీశారు. చట్టబద్ధంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. పీఆర్సీ నివేదికలో చెప్పకూడని అంశాలు ఏమైనా ఉన్నాయా అని దుయ్యబట్టారు.

ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు ఉద్యోగులను కించపరిచే విధంగా ఉన్నాయన్న బొప్పరాజు.. పీఆర్సీ అమలు విషయంలో ఆర్థిక మంత్రి ఉద్యోగులతో చర్చలు జరపడం సంప్రదాయమని గుర్తు చేశారు. బుగ్గన ఒక్క రోజైనా ఉద్యోగులతో మాట్లాడారా? ఆయన అందుబాటులో ఉన్నదెప్పుడు అని జేఏసీ నేతలు నిలదీశారు. రెండో దశ ఉద్యమంలోకి వెళ్లేలోపే ప్రభుత్వం స్పందించాలని హితవు పలికారు. సీఎం స్పందిస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని అర్ధమవుతోందన్నారు.