పీఆర్సీపై పాడిందే పాట‌.. జ‌గ‌న‌న్న ఖ‌జానా ఖాళీ అంటున్న సీఎస్‌ సమీర్‌ శర్మ..

ఏపీ ప్ర‌భుత్వం చెప్పిందే చెబుతోంది. పీఆర్సీపై పాడిన పాటే మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుతోంది. స‌జ్జ‌ల చెప్పిందే.. జ‌గ‌న‌న్న చెప్పారు.. వాళ్లిద్ద‌రూ చెప్పిందే తాజాగా సీఎస్ స‌మీర్‌శ‌ర్మ చెప్పారు. ఇలా అంతా క‌లిసి.. ఒకే మాట‌పై ఉన్నారు. ఉద్యోగుల‌కు అన్యాయం చేయ‌డంలో ఏమాత్రం తేడా రాకుండా చూసుకుంటున్నారని అంటున్నారు. ఐఆర్ కంటే త‌క్కువ‌గా పీఆర్సీ పెంచి.. హెచ్ఆర్ఏకు కోత పెట్టి.. ఆ వాత క‌నిపించ‌కుండే డీఏల‌తో క‌వ‌ర్ చేశార‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు. సంఘాలు స‌మ్మెకు సిద్ద‌మంటున్నా.. స‌ర్కారు మాత్రం పెంచేదేలే అంటోంది. ఇచ్చినంతా తీసుకొని స‌రిపెట్టుకోమంటోంది. రాష్ట్రం ప‌రిస్థితి అస్స‌లు బాగోలేద‌ని.. వ‌చ్చిన రాబ‌డి అంతా ఉద్యోగుల జీతాల‌కే ఖ‌ర్చై పోతోందంటూ.. ఆ పాప‌మంతా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పైనే మోపారు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌. ఇంత‌కీ పీఆర్సీపై సీఎస్ ఏమ‌న్నారంటే......

"రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువ. కొన్ని పెరుగుతాయి.. కొన్ని తగ్గుతాయి.. మొత్తంగా వేతనం చూడాలి. పూర్తిగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఏపీ రెవెన్యూ పడిపోయింది. కరోనా తీవ్రత ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రాష్ట్ర పరిస్థితులు దిగజారిపోయాయి." అంటూ సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఉద్యోగుల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఏపీ ఆర్థిక దుస్థితి గురించి ఏక‌రువు పెట్టారు. ప్ర‌భుత్వం దివాళా అంచున ఉందంటూ.. ప‌రోక్షంగా జ‌గ‌న‌న్న పాల‌న వైఫ‌ల్యాన్ని చెప్ప‌క‌నే చెప్పారంటున్నారు. సీఎస్ చెప్పిన దాంట్లో కొత్త విష‌య‌మేమీ లేద‌ని.. అంద‌రికీ తెలిసిందే.. పాత పాటే మ‌ళ్లీ పాడారంటూ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు పెద‌వి విరుస్తున్నారు. జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇచ్చేలా.. స‌మ్మెకి సిద్ధ‌మ‌వుతున్నారు.