అంబులెన్సుల్లోనే పోతున్న ప్రాణాలు.. ఏపీకి దిక్కెవరు! 

కరోనా మహమ్మారి కల్లోలంలో ఆంధ్రప్రదేశ్  అల్లాడిపోతోంది. వైరస్ విజృంభణతో రోజూ 22 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. హాస్పిటల్స్ లో బెడ్లు లేవు.. బెడ్లు ఉన్నా ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ ఉన్నా హాస్పిటల్స్ లో పర్యవేక్షణ లేకసరఫరా సరిగా జరగడం లేదు. దీంతో కొవిడ్ రోగులు కళ్లముందే గిలాగిలా కొట్టుకుంటూ చనిపోతున్నారు. వెంటిలేటర్లపై ఉన్న రోగుల ప్రాణాలకు దిక్కు లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 

కరోనాతో కొట్టుమిట్టాడుతూ... కనీస వైద్యం అందక జనం అల్లాడిపోతుంటే... నించున్న చోటే నిలువునా కూలి ప్రాణాలు పోతుంటే...కుల కషాయం నూరి చేతగాని తనాన్ని దులిపేసుకునే పనిలో ఉన్నారు పాలకులు. వ్యాప్తిని అడ్డుకునే వ్యూహం లేదు. ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్లకి వైద్యం చేసే దిక్కు లేదు. చచ్చీచెడీ బెడ్ దొరకబుచ్చుకున్నా రూయాలో ఆగినట్టు... ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు వందలు. అంత వరకూ రాక ముందే ఆగుతున్న గుండెలు అయితే వేలే. 30 ఏళ్ల నాడే ఆత్యాధునిక వైద్య సదుపాయాలకు నిలయంగా నిలచిన బెజవాడ ఇప్పుడు కుల రాజకీయంతో కూలిపోతోంది. దిగువన అనంత మొదలు... పైనున్న ఉత్తరాంధ్ర వరకూ ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడాలంటే కనబడుతున్న ఒకే ఒక్క ఆశ హైద్రాబాద్. 

జగన్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు హైదరాబాద్ బాట పడుతున్నారు ఏపీ కోవిడ్ రోగులు. అయితే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతోంది. ఏపీ నుంచి వచ్చే కోవిడ్ రోగులను సరిహద్దులోనే అడ్డుకుంటోంది తెలంగాణ సర్కార్. కరోనా కల్లోల సమయంలో  ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్సులను ఆపేయడం అంటే బెడ్ మీదున్నప్పుడు అందుతున్న ఆక్సిజన్ ను ఆపడమే. రోజుకి 22 వేల పైచికులకి కేసులున్న ఏపీనే తెలంగాణ వాహనాలను ఆపి ఆడిట్ చేసి... బుర్రతక్కువ మెహర్బానీ చూపిస్తున్నప్పుడు హైద్రాబాద్ లాంటి నగరం ఉన్న మనం ఎందుకు ఆపకూడదన్న ఆలోచనో, మరి ఇంకేమో తెలియదు కానీ తెలంగాణ ఆపింది ఏపీ అంబులెన్సుల్ని. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో పదుల సంఖ్యలో అంబులెన్సులు నిచిలిపోయాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కాళ్లు మొక్కి ప్రాధేయపడుతున్నా తెలంగాణ పోలీసులు కనికరించడం లేదు. అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతించకపోవడంతో.. అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు కొవిడ్ రోగులు. 

ఇంతటి సంక్షోభ సమయంలో స్పందించిన పాపాన పోవడం లేదు ఏపీ సర్కార్. ప్రశ్నించిన పాలకుడు లేడు. ప్రయత్నించిన వాడూ కానరాలేదు. లక్షలు ఖర్చుపెట్టి అంబులెన్సులు సిద్ధం చేసుకొని బోర్డర్ వరకూ వచ్చినా... అక్కడే ఆపేసే సరికి ఏం చేయాలో తెలియక బోరుమన్న వందల మంది కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆంధ్రుల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయ్. ప్రజల ప్రాణాలు పోతున్నా జగన్ రెడ్డి సర్కార్ చోద్యం చూస్తోంది.  తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు సన్నిహితుడు అని చెప్పుకునే జగన్... ఈ సమస్య పరిష్కారం కోసం ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ జనాలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాల పట్ల మానవత్వం చూపాల్సిన సమయంలో.. ఏమాత్రం కరుణ లేకుండా వ్యవహరిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ఇప్పుడు ఏపీకి దిక్కెవరు అంటూ రోధిస్తున్నారు. తమకే భగవుంతుడే దారి చూపాలంటూ వేడుకుంటున్నారు ఏపీ రోగులు.